వస్తున్నాయ్.. ఆర్‌బీఐ డేటా సెంటర్లు
ABN , Publish Date - Nov 19 , 2024 | 06:54 AM
ఆర్థిక సేవల రంగంలోని చిన్న కంపెనీలకు అందుబాటు ధరల్లో క్లౌడ్ డేటా స్టోరేజీ వసతి కల్పించడం లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశంలో లోకల్ క్లౌడ్ డేటా స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. వీటిలో ఒకటి హైదరాబాద్‌లోను, మరొకటి ముంబైలోను
వస్తున్నాయ్.. ఆర్‌బీఐ డేటా సెంటర్లు
తక్కువ ధరలకే చిన్న సంస్థలకు క్లౌడ్ సేవలు
హైదరాబాద్‌లో ఒకటి, ముంబైలో మరోటి
ముంబై: ఆర్థిక సేవల రంగంలోని చిన్న కంపెనీలకు అందుబాటు ధరల్లో క్లౌడ్ డేటా స్టోరేజీ వసతి కల్పించడం లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశంలో లోకల్ క్లౌడ్ డేటా స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. వీటిలో ఒకటి హైదరాబాద్‌లోను, మరొకటి ముంబైలోను ఏర్పాటు కావచ్చని తెలుస్తోంది. 2025లో ప్రయోగాత్మకంగా ఆర్‌బీఐ ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు ఈ వివరాలు వెల్లడించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఇది అత్యంత రహస్య సమాచారం కావడం వల్ల తమ పేర్లు వెల్లడించేందుకు వారు నిరాకరించారని కథనం తెలిపింది. ఇందుకోసం ఆర్‌బీఐ స్థానిక ఐటీ కంపెనీల సేవలు ఉపయోగించుకోనుంది. ఈ డేటా సెంటర్లను అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూరే, గూగుల్ క్లౌడ్, ఐబీఎం క్లౌడ్‌కు పోటీగా నిలుపుతారు. ఆసియాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో క్లౌడ్ సర్వీసుల మార్కెట్ పరిమాణం 2023లో 830 కోట్ల డాలర్లుండగా (రూ.70,550 కోట్లు) 2028 నాటికి 2420 కోట్ల డాలర్లకు (రూ.2.06 లక్షల కోట్లు) చేరుతుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ అంచనా. అయితే ఈ మార్కెట్లో విదేశీ సంస్థలే ఇప్పటి వరకు ఆధిపత్యం చలాయిస్తున్నాయి.
తొలుత స్వల్ప స్థాయిలో
రాబోయే కొద్ది నెలల్లో ఈ ప్రాజెక్టును స్వల్ప స్థాయిలో ప్రారంభించి తదుపరి దశలో దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది తమ ప్రయత్నమని ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్లౌడ్ డేటా సర్వీసులు భరించగల స్థితి తమకు లేదని భావించే బ్యాంకింగ్, ఆర్థిక సేవా రంగ సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌గా ఎర్నెస్ట్ అండ్ యంగ్‌ను (ఈవై) నియమించారు. తొలి దశలో ఈ వ్యవహారాలను ఆర్‌బీఐకి చెందిన పరిశోధన విభాగం ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. తదుపరి దశలో ప్రైవేటు రంగంలోని టెక్నాలజీ కంపెనీల భాగస్వామ్యంతో చేపడతారని ఆ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రారంభ దశలో ప్రాజెక్టుకు కావలసిన పెట్టుబడిని ఆర్‌బీఐ వద్ద ఉన్న రూ.22,974 కోట్ల అసెట్ డెవల్‌పమెంట్ ఫండ్ నుంచి సమకూర్చుతారు. తదుపరి దశలో ఇందులో ఈక్విటీ భాగస్వామ్యం తీసుకోవాలని ఆర్థిక సంస్థలను కేంద్ర బ్యాంక్ ఆహ్వానించనుంది.
డేటా స్థానికీకరణే లక్ష్యం
చెల్లింపులు, ఆర్థిక డేటాను స్థానికీకరించాలన్న ఆర్‌బీఐ కృషిలో దీన్ని తొలి అడుగుగా భావించవచ్చు. క్లౌడ్ సంబంధిత సొల్యూషన్లు అందించడంలో అనుభవం గల దేశీయ కంపెనీలను మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించారు. కంపెనీలు వ్యక్తిగతంగా గాని, కన్సార్షియంగా గాని దీనికి బిడ్ చేయవచ్చు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి దేశంలో క్లౌడ్ సేవల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు కంపెనీలు ఆసక్తిని ప్రకటిస్తున్నాయంటున్నారు.