Share News

ఈ మార్చి చివరినాటికి వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:18 AM

ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభు త్వం మొత్తం రుణాలు రూ.171.78 లక్షల కోట్లకు పెరిగాయి. 2023 డిసెంబరు చివరి నాటికి నమోదైన రూ.166.14 లక్షల కోట్లతో పోలిస్తే, మూడు నెలల్లో 3.4 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ...

ఈ మార్చి చివరినాటికి వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభు త్వం మొత్తం రుణాలు రూ.171.78 లక్షల కోట్లకు పెరిగాయి. 2023 డిసెంబరు చివరి నాటికి నమోదైన రూ.166.14 లక్షల కోట్లతో పోలిస్తే, మూడు నెలల్లో 3.4 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం స్థూల రుణాల్లో పబ్లిక్‌ డెట్‌ వాటా 90.2 శాతంగా నమోదైందని తెలిపింది. ఈసారి బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన రుణ సమీకరణ ప్రణాళిక మార్కెట్‌ అంచనాల కన్నా మెరుగ్గా ఉండటం, ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి కట్టడి చేస్తామన్న లక్ష్యంతోపాటు క్యాపిటల్‌ మార్కెట్లోకి విదేశీ పెట్టు బడుల ప్రవాహం కొనసాగడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో ప్రభుత్వ బాండ్ల వడ్డీరేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయని తన ప్రకటనలో పేర్కొంది. కాగా, అమెరికా బాండ్ల రేట్లు తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయని.. ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయాలు, ఆ దేశ ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన గణాం కాలు అందుకు కారణమని నోట్‌లో ప్రస్తావించింది.


కీలక రంగాల వృద్ధి 6.3 శాతం

ఈ ఏడాది మే నెలకు దేశంలోని 8 కీలక మౌలిక రంగాలు 6.3 శాతం వృద్ధిని కనబర్చాయి. ఈ ఏప్రిల్‌లో నమోదైన 6.7 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గినప్పటికీ, గత ఏడాది మే నెలలో నమోదైన 5.2 శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైంది. బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలను కీలక మౌలికా భివృద్ధి రంగాలుగా పరిగణిస్తారు. ఏప్రిల్‌తో పోలిస్తే తగ్గినప్పటికీ.. బొగ్గు, సహజ వాయువు, విద్యుత్‌ రంగాలు గతనెలలో మెరుగైన పనితీరు కనబర్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ముడిచమురు, సిమెంట్‌, ఎరువుల రంగాలు మాత్రం డీలా పడ్డాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలలకు (ఏప్రిల్‌-మే) కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 6.5 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి వృద్ధి 4.9 శాతంగా ఉంది.


బడ్జెట్‌ అంచనాల్లో 3 శాతానికి ద్రవ్యలోటు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలలు పూర్తయ్యే సరికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలో కేవలం 3 శాతానికి పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలపై ఆంక్షలు అమలు కావడం ఇందుకు ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి లోటు బడ్జెట్‌ అంచనాలో 11.8 శాతంగా నమోదైంది. ప్రభుత్వ రాబడి, వ్యయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటు అంటారు. మార్కెట్‌ నుంచి రుణాల సమీకరణ ద్వారా ప్రభుత్వం ఈ లోటును పూడ్చుతుంది. 2024-25లో ద్రవ్యలోటు రూ.16,85,494 కోట్లు లేదా జీడీపీలో 5.1 శాతంగా నమోదు కావచ్చని ఈ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేసింది. కాగా, ఈ ఏప్రిల్‌, మే గడిచేసరికి ద్రవ్యలోటు రూ.50,615 కోట్లు లేదా బడ్జెట్‌ అంచనాలో 3 శాతంగా నమోదైంది.

Updated Date - Jun 29 , 2024 | 04:18 AM