Share News

ఆధునిక భావ కవిత్వానికి దీటైన మూడొందలేళ్ల కావ్యం

ABN , Publish Date - Jul 01 , 2024 | 12:26 AM

ఒకరిపై ఒకరికి అత్యంతంగా వలపు ఉన్న ఇద్దరు ప్రేమికులకు, ఏదో కారణం చేత, కొంతకాలం విడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఒకనాటి సాయంత్రం వారిరువురు కలుసుకుని, విడిపోయే సన్నివేశాన్ని...

ఆధునిక భావ కవిత్వానికి దీటైన మూడొందలేళ్ల కావ్యం

ఒకరిపై ఒకరికి అత్యంతంగా వలపు ఉన్న ఇద్దరు ప్రేమికులకు, ఏదో కారణం చేత, కొంతకాలం విడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఒకనాటి సాయంత్రం వారిరువురు కలుసుకుని, విడిపోయే సన్నివేశాన్ని ‘మలహణ చరిత్రము’ అనే కావ్యం, ద్వితీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం ఇలా వర్ణించింది.

కం. అడుగిడుచు మగుడిచూచుచు

నడు గామడగాఁగ నలసి యటఁ దొట్రిలుచున్‌

వడినీళ్ళ కెదురు నడిచిన

వడువున నెడఁబాసి చనిరి వనితయుఁ బతియున్‌.

‘భావుకత’ అనే మాటకు సరిపోయే ఆధునిక అర్థంలో, సున్నితమైన ఆలోచనలను చేసి ఆ ఆలోచనలను అంతకంటే సున్నితమైన మాటలలో పాఠకుడికి అందించడం క్రీ.శ.20వ శతాబ్దపు భావకవులతో మాత్రమే మొదలైందనే అభిప్రాయాన్ని నొక్కివక్కాణించేవారి మాటలలో ఎంత తొందరపాటుతనమున్నదో తెలియజెప్పడానికి ఉదాహరణలుగా నిలిచే పద్యాలలో ఒకటి ఈ పద్యం; అందులోనూ ముఖ్యంగా మూడవపాదంలోని భావం!


అడుగడుక్కీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఒకర్ని వదిలి ఒకరు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ ఇరువురి మధ్య పడుతున్న ఒక్కొక్క అడుగుకీ ఒక్కొక్క ఆమడ దూరం వారి మధ్య పెరుగుతూ ఉన్నట్లుగా ఉందట వాళ్ళకి. అనగా ప్రతి అడుగుకీ ఒక ఆమడ దూరం నడిచినంత భారంగా, అలసటగా ఉందని ఉత్ర్పేక్ష! అలా పెరిగిన అలసట, హృదయంలో భారాన్ని మరింత పెంచగా, అడుగులు తడబడుతూ పడసాగాయట! ఆ తడబాటు ఎంత భారమైనదంటే, ‘వడినీళ్ళ కెదురు నడిచినట్లుగా’ పడుతున్నాయట వాళ్ళ అడుగులు. ఏరు పొంగీ, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న స్థితిలో ఆ నీటికి ఎదురు నడిచి ఏరు దాటాల్సిన అనుభవం ఒక్కసారైనా అయినవాళ్ళకు, ఆ మాటలలో ఉద్దేశించిన భావం స్పష్టంగా అర్థమౌతుంది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ఒక్క అడుగు కూడా ఎదురు నడవడం ఎంతో కష్టంగా ఉంటుంది. ముందుకు ఎంత బలంగా అడుగు వేయాలని చూసినా అంతకు రెట్టింపు బలంతో నీటి ఉధృతి పడే అడుగుని వెనక్కి నెడుతుంది. ఆ కష్టాన్ని గుర్తుకు తెచ్చి, వారిరువురు ఒకరి నుండి ఒకరు దూరంగా నడిచి వెళ్ళే ప్రక్రియ ఎంత బాధతో కూడినదై సాగిందో కళ్ళకు కట్టినట్లు చూపబడింది ఆ మాటలలో. ఏ ఆధునిక భావకవి వర్ణనకైనా తీసిపోని వర్ణన మూడు శతాబ్దాల క్రితం నాటి ఈ పద్యకవి మాటలలో మనకు కనపడుతుంది.


పేరునుబట్టి కాశ్మీర దేశస్థుడుగా భావింపబడిన గొప్ప శివభక్తుడు మల్హణుడి జీవితానికి సంబంధించినవిగా లోకులు చెప్పుకునే కొన్ని సంఘటనలను కథావస్తువుగా చేసుకుని 17వ శతాబ్దానికి చెందిన యెడపాటి యెఱ్ఱనార్యుడు రచించిన కావ్యం ‘మలహణ చరిత్రము’. ఆధునిక భావకవిత్వ ధోరణికి చెందినవనిపించే పోలికలు, అరుదైన నానుడుల వర్ణన చిత్రాలు ఈ కావ్యంలో మెండుగా ఉన్నాయి.

పేద కుటుంబంలో పుట్టిన మల్హణుడు బహువిద్యావంతుడు, సౌదర్యవంతుడు. కథానాయిక పుష్పగంధి, మదనసేన అనే పేరుగల ఒక వారకాంత కూతురు, బహు సౌందర్యవతి. ఇరువురూ ఒకే ఒజ్జ దగ్గర పాఠాలు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాళ్ళవుతారు. వయసు పెరిగే కొలది వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారం పుష్పగంధి తల్లికి నచ్చదు. మల్హణుడి స్థితిగతులను గురించి తెలుసుకుని, పైసాకు పనికిరాని అతనితో ప్రేమ వలన ప్రయోజనం ఉండదని అతడిని ఇంటికి రానివ్వదు. ‘ఏ జంటకు ఏ జన్మలో హాని కలిగించామో, ఈ జన్మలో మనకీ విధంగా ఎడబాటును కలిగించాడు విధాత!’ అని బాధపడతారు ప్రేమికులిరువురూ. అలా ఉండగా, వారవనితయైున మదనసేన, తన కూతురైన పుష్పగంధి జీవిక కోసం తనలా కష్టపడకూడదన్న కోరికతో, వెదికి ఊరిలోని ధనికుడైన వ్యాపారస్తుని పుత్రరత్నమైన ధనదత్తుడనే యువకునితో కూతురికి పొందు కుదిర్చి, ఒకనాటి రాత్రి ఇద్దరినీ గదిలో వేసి సుఖించమని తాను తప్పుకుంటుంది. అయితే పుష్పగంధి మనసు మల్హణుడి మీద లగ్నమైయున్న కారణంగా గదిలోంచి బయటకు వెళ్ళి, తన దురదృష్టానికి దుఃఖిస్తూ ఉంటుంది. ‘‘ఎవరేమనుకున్నా, కూతురిని మదనసేన నాకు సొంతం చేసింది, అది చాలు ఇప్పటికి!’’ అని సంతోషంలో మునిగిపోయి, పుష్పగంధిని వదిలేసి ఆమె పరిచారికతో గదిలో సరసాలాడుతూ సుఖిస్తూ ఉంటాడు ధనదత్తుడు. హేయమైన ఆ సందర్భాన్ని ఈ క్రింది పద్యంలో వ్యాఖ్యానిస్తూ, ధనదత్తుడిని ఉద్దేశించి ‘శిథిలాత్ముడు’ అనే మాటను ప్రయోగించాడు యెడపాటి యెఱ్ఱనార్యుడు:


కం. వ్యథఁ దల్పుగడియ పెట్టియు

శిథిలాత్ముఁడు దాసితోడఁ జెనకుచునుండెన్‌

క్షుథనొందినట్టి పిల్లికి

విధిమూడిన యెల్క లేదె వెదకిన నైనన్‌.

(మలహణ చరిత్రము, తృతీయాశ్వాసం)

‘‘ఆకలితో అలమటిస్తున్న పిల్లికి, సరిగ్గా వెతకాలే గాని ఇంత ప్రపంచంలో విధి వక్రించి చావు దగ్గరపడిన ఒక్క బక్కచిక్కిన ఎలుక దొరకకుండా పోతుందా?’’ అని పై పద్యంలోని చివరి రెండు పాదాల భావం! హీనత్వానికి హద్దులను మాటలతో చెప్పడం కష్టం. వ్యాపారధర్మం అన్ని వైపులనుండి అనుక్షణమూ శాసిస్తూ ఉండే ఈ లోకవ్యవహారంలో, ఒక బలవంతుడి ఆకలి తీరడానికి ఒక బలహీనుడి నిస్సహాయత ఆహారంగా మారడం అన్న రాక్షస ధర్మం ఏ ఆర్భాటమూ లేకుండా నిర్వర్తించబడుతూ ఉంటుందన్న ఆధునిక కవి భావం ఈ చరణాలలోని మాటలలో గట్టిగానే చెప్పబడి కనపడుతుంది.


ప్రసిద్ధుడైన ఒక పూర్వ శివభక్తుడి జీవితంలో సంఘటనలను వస్తువుగా తీసుకుని, కథాగమనంలో సందర్భానికి సరిపోయే విధంగా ఆధునిక భావాలను, అరుదైన తెలుగు జాతీయాలను ఆలంబనగా చేసి, యెడపాటి యెఱ్ఱనార్యుడు రచించిన ‘మలహణ చరిత్రము’ పద్యకావ్యం నేటి తరానికి తెలియని ఎన్నో అర్థవంతమైన నానుడులను కాలంలో కనుమరుగైపోకుండా కాపాడిన కావ్యాలలో ఒకటి!

భట్టు వెంకటరావు

Updated Date - Jul 01 , 2024 | 12:26 AM