Share News

నాడు కరువు... నేడు కనక వర్షం!

ABN , Publish Date - Jul 12 , 2024 | 02:15 AM

టి 20 ప్రపంచ కప్‌ను గెలిచిన టీమ్ ఇండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి 125 కోట్ల రూపాయల నగదు నజరానా! భారతీయ క్రికెట్ ఎంతగా మారిపోయిందో ఈ ఘన బహుమానం సూచించడం...

నాడు కరువు... నేడు కనక వర్షం!

టి 20 ప్రపంచ కప్‌ను గెలిచిన టీమ్ ఇండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి 125 కోట్ల రూపాయల నగదు నజరానా! భారతీయ క్రికెట్ ఎంతగా మారిపోయిందో ఈ ఘన బహుమానం సూచించడం లేదూ! 1950, 1960 దశకాలలో మన టెస్ట్ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.250 చెల్లించేవారు. ఒకసారి న్యూజిలాండ్‌ను భారత్ కేవలం మూడు రోజుల్లోనే ఓడించినప్పుడు విజేతలు ఒక్కొక్కరికి కేవలం రూ.150 మాత్రమే చెల్లించారు! క్రికెట్ బోర్డ్ తీరు నాడు ఆ క్రికెటర్లనే కాదు, నేడు మనలనూ విస్మయపరుస్తుంది. క్రీడాకారులను కేవలం దినసరి వేతన కూలీలుగా క్రికెట్ బోర్డ్ పరిగణించిందన్నది ఒక వాస్తవం. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌ను రెండు రోజులు ముందుగానే విజయవంతంగా ముగించేయడమే ఆనాటి క్రికెటర్లు చేసిన తప్పిదం! ఆ తప్పుకు శిక్షగా వారికిచ్చే పారితోషికంలో రూ.100 తగ్గించారు.

1971లో ఓవర్సీస్ టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లను భారత్ ప్రప్రథమంగా ఓడించింది. భారతీయ క్రికెట్ ఘనతను ప్రపంచానికి చాటి స్వదేశానికి తిరిగివచ్చిన ఆ విజేతలకు, ఇటీవల రోహిత్ శర్మ టీమ్‌కు కంటే కూడా ఘనమైన స్వాగత సత్కారాలు లభించాయి. నాడు ఆ విజేతలను చూసేందుకు, అభినందించేందుకు క్రికెట్ అభిమానులు అసంఖ్యాకంగా ఎగబడ్డారు. హార్ధిక స్వాగతం ఎంత ఘనంగా లభించినా అంతిమంగా దక్కిన ఆర్థిక లబ్ధి పూజ్యం, నమ్మండి. ఒక జౌళి కంపెనీ మాత్రం ఉదారంగా ఆ విజేతలకు తలొక ప్యాంట్, షర్ట్ వస్త్రాలను కానుకగా ఇచ్చింది! 1983లో మహాశక్తిమంతమైన వెస్టిండీస్ జట్టును ఓడించి ప్రప్రథమంగా ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌ను గెలిచిన (కపిల్‌దేవ్ నాయకత్వంలోని) భారత్ జట్టు సభ్యులు ఒకొక్కరికి బీసీసీఐ చెల్లించింది కేవలం రూ.20 వేలు మాత్రమే. గాంధర్వ గాయని లతా మంగేష్కర్ ఆ విజేతల గౌరవార్ధం ఒక సంగీత కచేరి నిర్వహించారు. ఆ సంగీత సభ ద్వారా లభించిన ఆదాయాన్ని ఆ క్రికెటర్లకు బహుమానంగా అందజేశారు. అలా ఒకొక్కరికి అందిన మొత్తం లక్ష రూపాయలే. ఈ నాటి క్రికెటర్లకు లభిస్తున్న కోట్లాది రూపాయలతో పోలిస్తే ఆ మొత్తం ఎంత! అన్నట్టు ఇప్పుడు టీమ్ ఇండియా సహాయ సిబ్బంది సైతం అంత కంటే అధికంగానే ఆర్థిక లబ్ధి పొందుతున్నారు.


అప్పటికీ ఇప్పటికీ భారత క్రికెట్ జగత్తులో చోటుచేసుకున్న అతి పెద్ద మార్పు క్రీడాకారులకు దక్కుతున్న విశేష ఆర్థిక లబ్ధి అని చెప్పి తీరాలి. కేవలం అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలో ఆడేవారికే కాదు, దేశీయ టోర్నమెంట్‌లలో ఆడేవారికి సైతం ద్రవ్య లాభం అధిక మొత్తంలో ఉంటోంది. ఉదాహరణకు రంజీ ట్రోఫీనే తీసుకోండి. మ్యాచ్ ఫీజుగా రోజుకు రూ. 40 నుంచి రూ.60 వేలు దాకా బీసీసీఐ చెల్లిస్తోంది. దేశీయ టోర్నమెంట్ సీజన్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లలో ఆడే క్రీడాకారుడికి ఇంచుమించు రూ.30 నుంచి రూ.40 లక్షల దాకా ఆదాయం లభిస్తోంది. మరి 1960ల నాటి రంజీ ట్రోఫీ క్రీడాకారులకు ఎంత చెల్లించేవారో తెలుసా? ఒకో మ్యాచ్‌కు ఒకొక్కరికి కేవలం రూ.10 మాత్రమే లభించేది. ఆ తరం క్రీడాకారులు గౌరవ ప్రదంగా జీవించేందుకు ఎస్‌బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలోనో లేదా టాటా లాంటి ఉదారశీల ప్రైవేట్ కంపెనీలోనే భద్రమైన ఉద్యోగం మాత్రమే ఆధారం మరి.

భారత క్రికెట్ జగత్తులోకి ధన ప్రవాహం ఎలా ప్రవేశించింది? ఈ అందమైన ఆటను ధనశక్తి ప్రభావితం చేయడం ఎలా ప్రారంభమయింది? మూడు నిర్ణయాత్మక పరిణామాలు అందుకు దోహదం చేశాయి. అవే మన క్రికెట్ జగత్తులో ఈ మిలియనీర్ రాజ్‌ను నెలకొల్పాయి. మొదటిది నిస్సందేహంగా 1983 ప్రపంచ కప్ విజయం. భారత క్రికెట్ చరిత్రలో అదొక అనూహ్య మలుపు. ఆ విజయం ఒక తరం తరాన్ని చాలా పెద్ద విషయాలను స్వప్నించేందుకు పురిగొల్పింది. నాలుగు సంవత్సరాల అనంతరం ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను ఇంగ్లాండ్‌లో కాకుండా భారత్‌లో (ప్రప్రథమంగా) నిర్వహించారు.


రెండో పరిణామం 1990ల్లో అమలయిన ఆర్థిక సంస్కరణలు; అదే సమయంలో సంభవించిన శాటిలైట్ టీవీ విప్లవం. దాని ఫలితంగా క్రికెట్ క్రీడాకారులు తమ బ్రాండ్ విలువను తెలుసుకున్నారు. తమ ప్రభావశీలతను వ్యక్తిగత ఆర్థిక లభ్ధికి సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ వాణిజ్య ప్రకటనల మహారాజుగా వెలుగొందారు. టీవీలో సచిన్ లేని, ఏ వస్తువుకు సంబంధించిన వాణిజ్య ప్రకటనా ప్రసారమయ్యేది కాదంటే నమ్మి తీరాలి.

మూడోది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). క్రికెట్ జగత్తులో పెను మార్పుకు కారణమైన ఐపీఎల్, 2008లో క్రీడా ప్రపంచాన్ని ఊపేసింది. విభ్రమపరిచింది. సంబరపరిచింది. దీనితో ఒక్కసారిగా క్రికెట్ అనేది భారతీయుల మనస్సున పూర్తిగా ఆవహించిన ఆటగా..... మాత్రమే కాకుండా భారత క్రికెట్ ప్రపంచం మెచ్చే క్రీడగా వెలుగొందడం ఆరంభమయింది. సమస్త ఐపీఎల్ టీమ్‌ల విలువ వందల కోట్ల రూపాయలలో ఉండడం ఒక సాధారణ విషయమయింది. ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచ రెండో మహా సంపద్వంతమైన స్పోర్ట్స్ లీగ్‌గా వెలుగొందుతోంది. మ్యాచ్ విలువ పరంగా అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ తరువాయి స్థానం ఐపీఎల్‌దే. ప్రవాసంలో ఉన్న ఐపీఎల్ ఆవిర్భావానికి ప్రధాన కారకుడు లలిత్ మోడీ తాను ఎంతటి మహా ప్రభావదాయక క్రీడా పోటీని ప్రారంభించడం జరిగిందన్న విషయమై ఆశ్చర్యపోతున్నాడేమో?!


అంతా బాగానే ఉంది. అంతా మన మంచికే. క్రికెట్ ఆకాంక్షాభరితమైనది. ప్రతిభా సమన్వితమైనది. శతాధిక కోట్ల భారతీయుల స్వప్నాలను నెరవేర్చేది. అన్ని విధాలా క్రికెట్ పెరుగుదల ప్రభావం ఇతర ఆటలపై కూడా బహుముఖీనంగా ఉంటుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులు అదృష్టవంతులు. మునుపటి ఒలింపియన్లు కలలో కూడా ఆశించని ఆర్థిక లబ్ధి పారిస్ ఒలింపియన్లకు లభించనున్నది. ఈ తరం వారికి మెరుగైన, ప్రశస్తమైన శిక్షణ కూడా లభిస్తోంది. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ల నుంచి అసాధారణ జావెలిన్ హీరో నీరజ్ చోప్రా దాకా భారతీయ క్రీడాకారులు ఎందరో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులతో సమర్థంగా పోటీ పడుతున్నారు. విజయాలు సాధిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన క్రీడా సంఘాలు అన్నీ వృత్తి నిబద్ధతతో పనిచేయడం లేదు. ఈ అవలక్షణం మూలంగానే ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు మరిన్ని ప్రశస్తమైన విజయాలు సాధించలేకపోతున్నారు.

సరే, మళ్లీ బీసీసీఐ విషయానికి వద్దాం. దేశంలో అత్యంత సంపద్వంతమైన క్రీడా సంఘమది. కొంత మంది దృష్టిలో అత్యంత అపారదర్శకంగా పనిచేసే క్రీడా సంఘం కూడా అదే. జైషా నాయకత్వంలోని బీసీసీఐ సగర్వంగా చెప్పుకోగల విషయాలు కొన్ని ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మహిళా క్రికెట్‌కు అందిస్తున్న ప్రోత్సాహం వాటిలో ముఖ్యమైనది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకూ పారితోషికాల చెల్లింపులు జరగడం, ప్రత్యేకంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు రెండూ చరిత్రాత్మకమైనవి, ప్రశంసించి తీరాల్సినవి. అవి జెండర్ అవరోధాలను తొలగించాయి. క్రికెట్ క్రీడా జగత్తును ప్రపంచాన్ని మరింతగా సమ్మిళితమయ్యేందుకు దోహదం చేసిన కీలక చర్యలవి, సందేహం లేదు. ఎన్నో ప్రశంసనీయమైన మార్పులను తీసుకువచ్చినప్పటికీ నేటి బీసీసీఐ ఇప్పటికీ రాజకీయ మద్దతు, ప్రాబల్యమున్న అధికారుల కోటరీ నియంత్రణలో పనిచేస్తోంది. జవాబుదారీతనం చూపని ఈ పెద్ద మనుషులు ఆ ప్రపంచ క్రీడ వ్యవహారాలను అమితంగా ప్రభావితం చేస్తున్నారు, పెత్తందారీతనంతో నియంత్రిస్తున్నారు.


భారతీయ క్రికెట్ ఒక మహాశక్తి. సూపర్ పవర్ హోదాతో వెలుగొందుతోంది. మరి అటువంటి ప్రభావశీలతకు చిత్తశుద్ధితో బాధ్యతల నిర్వహణ కూడా తోడైతే ఎంత బాగుండును! బీసీసీఐ పెద్దలు భారత క్రికెట్ సంరక్షకులే కానీ దాని యజమానులు కానేకారు. క్రికెట్ బోర్డు, ఒక ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజీ ఎంతమాత్రం కాదు. మరి క్రీడకు సంబంధించిన ప్రశస్త సంప్రదాయాలను సమున్నతం చేయవలసిన బాధ్యత బీసీసీఐకి ఉన్నది. క్రీడాకారులు, క్రికెట్ వ్యవహారాల నిర్వాహకుల మధ్య తేడాను పాటించడం అటువంటి అత్యుత్తమ సంప్రదాయాలలో ఒకటి. మరి క్రికెట్ బోర్డ్ అధికారులు ‘ఇండియా ఛాంపియన్’ టీషర్ట్‌లు ధరించి విజేతలయిన క్రీడాకారులతో పాటు ఓపెన్ టాప్ బస్‌పై కూర్చుని క్రీడాభిమానుల కేరింతలకు క్రీడాకారుల వలే చేతులు ఊపుతూ ప్రతిస్పందించడం ఏమి సబబు? ట్రోఫీ ఎత్తిపట్టుకుని ఫోటోలు కూడా దిగడమా? ఇది ఎంత మాత్రం సరైనది కాదు.

మరి కొద్ది నెలల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)కి జైషా తదుపరి అధ్యక్షుడు అయ్యే అవకాశమున్నది. 35 ఏళ్ల షా క్రికెట్‌కు బిగ్‌బాస్‌గా చాలా శీఘ్రగతిన ఎదిగారు. ఐసీసీకి అధ్యక్షుడు కావడం ఆయన ఉత్థానంలో మరో గొప్ప ముందడుగు. అమిత్ షా కుమారరత్నం అయిన జైషా ‘నెపో బేబీ’ (తండ్రి పలుకుబడితో ఉన్నత స్థాయికి ఎదిగిన బిడ్డ)కి ఒక మంచి ఉదాహరణ అని ఆయన విమర్శకులు అంటుండవచ్చు గానీ జూనియర్ షా పనితీరు ప్రశస్తమైనది అనడంలో సందేహం లేదు. అనేక మేలు మార్పులకు ఆయన ప్రధాన కారకుడు. అయితే ఇప్పుడు ట్రోఫీలను గెలవడమే కాకుండా నిజమైన క్రికెట్ సంస్కృతిని గౌరవించవలసిన అవసరమున్నదన్న విషయాన్ని జైషా, క్రికెట్ బోర్డు అధికారులు గుర్తించాలి. బీసీసీఐ అధికారులు క్రికెట్ సంరక్షకులే కానీ ఆ ఆట వ్యవహారాలను శాసించే సర్వాధికారులు కారు.


తాజా కలం: ఇంగ్లాండ్‌లో ఏటా జరిగే వింబుల్డన్ టెన్నిస్‌ టోర్నమెంట్ విశిష్టమైన, అద్వితీయమైన క్రీడా సంఘటన. ఈ ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ ఎందుకు ప్రశస్తమైన క్రీడా సంఘటనో వింబుల్డన్ ఇటీవలే మరోసారి నిరూపించింది. రాయల్ బాక్స్ (కులీన, ఉన్నతస్థాయి అతిథులు కూర్చునే ప్రదేశం)లో ఉన్న వారందరూ వివిధ క్రీడలలో ప్రపంచ స్థాయి ఘనాపాటీలే. మన భారత రత్న సచిన్ టెండూల్కర్ సహా వారందరూ ప్రత్యేక ఆహ్వానితులు. వింబుల్డన్ అధికారులు కానీ, కార్పొరేట్ కుబేరులు కానీ ఎక్కడా ప్రాధాన్యం పొందలేదు. మరి భారతీయ క్రికెట్ మ్యాచ్‌లో మనకు కనపడేది అందుకు పూర్తిగా విరుద్ధమైనదే కాదూ?

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - Jul 12 , 2024 | 02:15 AM