Share News

P. Chidambaram : ‘జమిలి’ సిఫారసు శాసనమయ్యేనా?

ABN , Publish Date - Sep 21 , 2024 | 02:08 AM

ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని నియమించడంలో ప్రభుత్వ నిజ ఉద్దేశం ఆ కమిటీ పరిశీలనాంశాలు బహిర్గతం చేశాయి.

P. Chidambaram : ‘జమిలి’ సిఫారసు శాసనమయ్యేనా?

క కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని నియమించడంలో ప్రభుత్వ నిజ ఉద్దేశం ఆ కమిటీ పరిశీలనాంశాలు బహిర్గతం చేశాయి. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరీక్షించి సిఫారసులు చేయాలని....’ మొదటి పరిశీలనాంశం నిర్దేశించింది. లోక్‌సభ ఎన్నికలు, 29 రాష్ట్రాల, (శాసనసభ ఉన్న) కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం సాధ్యమూ, వాంఛనీయమూ అన్నది ఆ అత్యున్నత స్థాయి కమిటీకి ప్రభుత్వ సూచిత ఆదేశం. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా సిఫారసు చేయాలనే ఆదేశం ఆ కమిటీకి లేదు. ఆ కమిటీ నిష్ఠాపూర్వకంగా ఆ ఆదేశాన్ని పాటించింది.

ఆ అత్యున్నత స్థాయి కమిటీ కూర్పు సైతం ప్రభుత్వ వాస్తవ ఉద్దేశాన్ని వెల్లడించింది. చైర్మన్‌, 8 మంది సభ్యులలో రాజ్యాంగ నిపుణుడు ఒకే ఒక్కరు ఉన్నారు. మరో సభ్యుడు పార్లమెంటరీ కార్యసరళిలో ప్రవీణుడు. అయితే ఆయనకు న్యాయవాద వృత్తిలోను, న్యాయ శాస్త్ర బోధనలోను బొత్తిగా ఎటువంటి అనుభవంలేని వ్యక్తి. ఇద్దరు రాజకీయవేత్తలుగా మారిన బ్యూరాక్రాట్లు. ముగ్గురు జీవితాంతం సివిల్‌ సర్వెంట్లు. సరే, ఆ అత్యున్నతస్థాయి కమిటీకి రామ్‌నాథ్‌ కోవింద్‌ను చైర్మన్‌గా నియమించడం అలంకార ప్రాయానికే అని చెప్పవచ్చు. కాదూ, ఆ కమిటీకి గాంభీర్యం, హుందా సంతరించేందుకు అయివుంటుంది. ఆ కమిటీ ఏమైనా కావచ్చు కాని, అది కచ్చితంగా రాజ్యాంగ కోవిదుల సంఘం కానేకాదు.


అందరూ ఊహించినట్లుగానే లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఐదేళ్లకొకసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోవింద్‌ కమిటీ సిఫారసు చేసింది. నాకు తెలిసినంతవరకు ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి రివాజు లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఎన్నికల విధానాలు పోల్చదగిన నమూనాలు. అమెరికాలో ప్రతినిధుల సభ (కాంగ్రెస్‌ దిగువ సభ)కు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. దేశాధ్యక్షుడు, రాష్ట్ర గవర్నర్ల పదవులకు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అయితే ఏకకాలంలో కాదు. కాంగ్రెస్‌ ఎగువ సభ సెనేట్‌కు ఆరు సంవత్సరాల వ్యవధిలో మూడు ద్వివార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీలోని రెండు రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వాటి వాటి ఎన్నికల క్రమం ప్రకారమే అవి జరిగాయి. ఆ క్రమం బండేస్టాగ్‌ (నేషనల్‌ పార్లమెంట్)కు జరిగే ఎన్నికల క్రమానికి భిన్నమైనది.

ఫెడరల్‌, పార్లమెంటరీ ప్రజాస్వామ్య భావనకు విరుద్ధమైన ప్రతిపాదనను కోవింద్‌ కమిటీ అధ్యయనం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు ప్రతిరోజూ జవాబుదారీగా ఉండాలి. కార్యనిర్వాహక వర్గానికి ధ్రువపరిచిన పదవీకాలం ఉండదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించే విషయమై రాజ్యాంగ సభ కూలంకషంగా చర్చించింది. అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపే వారు మెగ్గారు. భారతదేశ వైవిధ్యం, బహుళత్వంకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థే బాగా సరిపోతుందని వారు దృఢంగా విశ్వసించారు.


కోవింద్‌ కమిటీ నివేదిక కొందరికి మాత్రమే అర్థమయ్యే బీజగణిత సూత్రాలు, అతిగా సరళీకరించిన న్యాయ సూత్రీకరణల కలగూర గంప. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనను అమలుపరిచేందుకు రాజ్యాంగాన్ని విధిగా సవరించవలసిన అవసరమున్నదని కోవింద్‌ కమిటీ అంగీకరించింది. కొత్త అధికరణలు 82ఎ, 83(3), 83(4), 172(3), 172(4), 324ఎ, 325(2), 325(3) ప్రవేశపెట్టడంతో పాటు అధికరణ 327ను సవరించవలసి ఉన్నది. ఈ కొత్త నిబంధనలు, సవరణలు ఒక రాష్ట్ర అసెంబ్లీ పదవీకాల ముగింపు తేదీ, లోక్‌సభ పదవీకాల ముగింపు తేదీ సమకాలికమయ్యేలా చేస్తాయి.

ప్రభుత్వం తలపెట్టినట్లు నవంబర్‌– డిసెంబర్ 2024లో రాజ్యాంగ సవరణలను ఆమోదించారని అనుకుందాం. ఏకకాలంలో ఎన్నికలు 2029లో జరగవలసి ఉంటుంది. మరి 2025, 2026, 2027, 2028 సంవత్సరాలలో జరిగే రాష్ట్ర శాసనసభ (ఇవి మొత్తం 24)ల పదవీకాల వ్యవధి 1 నుంచి 4 సంవత్సరాల పాటు తగ్గిపోతుంది! 2027లో ఒక శాసనసభను ఎన్నుకోవడమంటే కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే అవుతుంది. 2028లో ఎన్నుకునే శాసససభలు కేవలం ఒకే ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటాయి! ఇటువంటి ఎన్నికలను సదరు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ పార్టీలు అంగీకరిస్తాయా? మరి ప్రజల తీర్పు త్రిశంకు సభ (హంగ్‌ అసెంబ్లీ) ఏర్పడడానికి మాత్రమే దారితీస్తే ఏమి చేయాలి? ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోతే ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏమిటి?


ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రి పదవికి పోటీపడేవారు అవసరమైన మెజారిటీని కూడగట్టుకోలేనప్పుడు ఏమి చేయాలి? అటువంటి పరిస్థితుల్లో సభ ఐదేళ్ల పదవీ కాలంలో మిగిలిన కాలానికి కొత్త అసెంబ్లీని ఎన్నుకునేందుకు మళ్లీ ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది కదా. ఆ కొరవ కాలం కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉండవచ్చు సుమా! అటువంటి ఎన్నికలు ప్రహసనప్రాయమవుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అపార ధనబలం ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు (ఎన్నికల బాండ్లతో సంపద్వంతమైన రాజకీయ పార్టీలున్న విషయాన్ని విస్మరించకూడదు) మాత్రమే అటువంటి ఎన్నికలలో పోటీ చేస్తారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే కోవింద్‌ కమిటీ సిఫారసులు ముఖ్యమంత్రి తన అధికారాన్ని నిలుపుకునేందుకు బాగా ఉపయోగపడతాయి. అసెంబ్లీని రద్దు చేస్తాననే బెదిరింపుతో అసంతృప్త ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కట్టడి చేయగలుగుతాడు.


కోవింద్‌ కమిటీ సిఫారసులు మన ఎన్నికల చరిత్రను గమనంలోకి తీసుకోలేదు. అత్యధిక ప్రజల ఆలోచనలకు అవి విరుద్ధంగా ఉన్నాయి. 1951 నుంచి 2021 దాకా ఏడు దశాబ్దాల కాలంలో రాజకీయ అస్థిర పరిస్థితులు కేవలం రెండు దశాబ్దాల (1981–1990, 1991–2000)లో మాత్రమే ఉన్నాయి. 1999 నుంచి అసాధారణ స్థాయిలో రాజకీయ సుస్థిరత నెలకొనివుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు / శాసనసభలు తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశాయి. దఫాలు, దపాలుగా జరిగే ఎన్నికలు ఆర్థికాభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయదు. యూపీఏ ప్రభుత్వాలు తమ పదేళ్ల పాలనలో 7.5 శాతం సగటు వార్షిక వృద్ధిరేటును సాధించాయి. తమ పదేళ్ల పాలన అంతకంటే మెరుగైన వృద్ధిరేటును సాధించిందని ఎన్డీఏ పదే పదే చెప్పుతోంది. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులకు పార్లమెంటు ఆమోదాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తప్పక పొందగలుగుతుందని కోవింద్‌ కమిటీ భావించినట్టుంది.

ఆ కమిటీ కచ్చితంగా పొరపడిందని చెప్పక తప్పదు. ఎందుకని? పార్లమెంటులో ఆ బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యా బలం ఎన్డీఏకు ఉన్నదా? లోక్‌సభలో ప్రతిపక్షం 182 మంది ఎంపీల మద్దతును కూడగట్టుకోగలుగుతుంది. రాజ్యసభలో విపక్షానికి 83 మంది ఎంపీలు ఉన్నారు. ఉభయ సభలలోను ఆ సవరణ బిల్లులు ఎట్టి పరిస్థితులలోను ఆమోదం పొంద లేవు బహుళ సంస్కృతులతో, అన్నిటా అపార వైవిధ్యమున్న ఈ సువిశాల భారతదేశంపై ఒకే ఎన్నికల విధానాన్ని రుద్దేందుకే ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదననుద్దేశించారు. ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యంకానిది. అది నిష్ప్రయోజనకరమైనది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Sep 21 , 2024 | 02:08 AM