Good stress: ఒత్తిడితో ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా?
ABN , Publish Date - Aug 17 , 2024 | 03:24 PM
అప్పుడప్పుడూ కలిగే స్వల్పకాలిక, పరిమితస్థాయి ఒత్తిడితో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రపరిభాషలో ఈ తరహా ఒత్తిడిని యూస్ట్రెస్ అంటారట. ఇది శరీరంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘకాలం పాటు ఉండే ఒత్తిడి అనేక అనారోగ్యాలకు దారి తీస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, అప్పుడప్పుడూ కలిగే స్వల్పకాలిక, పరిమితస్థాయి ఒత్తిడితో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రపరిభాషలో ఈ తరహా ఒత్తిడిని యూస్ట్రెస్ (Eustress) అంటారట. ఇది శరీరంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కష్టమైన పనులు చేసే సందర్భాల్లో ఈ తరహా ఒత్తిడి తలెత్తుతుందని అమెరికన్ సైకొలాజికల్ అసోసియేషన్ చెబుతోంది (Health Benefits of Good strees).
Health: ఇలా చేస్తే మీపై మీకు పూర్తి కంట్రోల్.. మనసు అదుపు తప్పదు!
మంచి ఒత్తిడితో కలిగే ఉపయోగాలు ఇవీ..
ఈ తరహా ఒత్తిడితో శరీరంలో కలిగే ప్రతిస్పందనలు ఆందోళన, కుంగుబాటును ఎదుర్కోవడంలో సహాయ పడతాయట.
తక్కువ స్థాయి స్ట్రెస్‌తో మెదడు ఉత్తేజితమై న్యూట్రోఫిన్స్ అనే కెమికల్స్ విడుదల అవుతాయి. ఇవి నాడీ కణాల మధ్య అనుసంధానతను పెంచి ఏకాగత్ర, ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి.
స్వల్ప ఒత్తిడి ఎదుర్కొనే సమయాల్లో విడుదలయ్యే ఇంటర్‌ల్యూకిన్స్ రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి.
ఇలాంటి ఒత్తిడి వల్ల భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కొనే మానసిక శారీరక సామార్థ్యాలు ఇనుమడిస్తాయి.
యూస్ట్రెస్, టెన్షన్ కారణంగా విజయం సాధించాలన్న పట్టుదల పెరుగుతుందట. పరిస్థితులకు అనుగుణంగా మారిపోయి ఉత్పాదకత పెంచుకునేందుకు తోడ్పాటునందిస్తుందట.
గర్భిణుల్లో కూడా స్వల్పకాలిక, పరిమిత స్థాయి ఒత్తిడి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని కూడా కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
అయితే, మంచి ఒత్తిడి, చెడు ఒత్తిడి మధ్య తేడాను తెలుసుకోవడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం ఒత్తిడి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. రోజంతా ప్రతికూల ఆలోచనలు, ఆందోళనతో గడిపేవారు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడతారు. కాబట్టి, ఒత్తిడుల్లో తేడాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.