Share News

Amul: మన అమూల్ అమెరికాకు.. అగ్రరాజ్యంలో పాల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Mar 23 , 2024 | 05:07 PM

ప్రఖ్యాతిగాంచిన అమూల్ డెయిరీ ప్రొడక్ట్స్ ఇప్పుడు అమెరికాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లో చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన అమూల్ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి అగ్రరాజ్యం వరకు చేరడంలో యాజమాన్యం, కార్మికులు, రైతుల ఎన్నో ఏళ్ల కృషి దాగి ఉంది.

Amul: మన అమూల్ అమెరికాకు.. అగ్రరాజ్యంలో పాల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్

ఆనంద్: ప్రఖ్యాతిగాంచిన అమూల్ డెయిరీ ప్రొడక్ట్స్ ఇప్పుడు అమెరికాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లో చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన అమూల్ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి అగ్రరాజ్యం వరకు చేరడంలో యాజమాన్యం, కార్మికులు, రైతుల ఎన్నో ఏళ్ల కృషి దాగి ఉంది.

"అమూల్ కంపెనీ అమెరికాలో సామ్రాజ్యాన్ని విస్తరించడానికి సిద్ధమైంది. యూఎస్ - మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో 108 ఏళ్ల నాటి డెయిరీ కోఆపరేటివ్‌తో మార్చి 20న డెట్రాయిట్‌లో జరిగిన వార్షిక సమావేశంలో ఒప్పందం కుదిరింది. అమూల్ విదేశాల్లో తమ ప్రొడక్ట్స్‌ని అందించడం ఇదే తొలిసారి. అమూల్ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా అమూల్ బ్రాండ్‌ను విస్తరించాలని, అతిపెద్ద డెయిరీ కంపెనీగా అవతరించాలని భావిస్తున్నాం. ప్రపంచంలోని బలమైన డెయిరీ బ్రాండ్‌లలో అమూల్ ఒకటిగా నిలిచింది" అని అమూల్‌ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు.

స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గుజరాత్ రైతులు 50 ఏళ్ల క్రితం నాటిన మొక్క ఒక పెద్ద వృక్షంగా మారిందని అన్నారు. అమూల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని కింద 18,000 పాల సహకార కమిటీలు ఉన్నాయి.


రోజుకి 36,000 మంది రైతుల నుంచి సమీకరించిన 3.5 కోట్ల లీటర్లకు పైగా పాలను ప్రాసెస్ చేస్తున్నారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ దాదాపు 21 శాతం వాటా కలిగి ఉంది. 1950 - 1960లలో భారత్ డెయిరీ రంగం పరిస్థితి భిన్నంగా ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 1964లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాను సందర్శించారు.

1965లో జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి మండలి (NDDB)ని ఏర్పాటు చేశారు. డెయిరీ కోపరేటివ్‌ల 'ఆనంద్ నమూనా' ఏర్పాటుకు మద్దతుగా నిలిచారు. శ్వేత విప్లవ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన వర్గీస్ కురియన్ NDDB మొదటి ఛైర్మన్‌గా పని చేశారు. అలా చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరిన అమూల్ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తోంది.

Updated Date - Mar 23 , 2024 | 05:08 PM