Share News

Canada: పంజాబీ గాయకుడి నివాసంపై కాల్పులు.. వీడియో విడుదల చేసిన పోలీసులు

ABN , Publish Date - Nov 01 , 2024 | 10:00 AM

కెనడాలోని పంజాబీ గాయకుడు ఏపీ ధిల్లాన్ నివాసంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో అభిజిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ చేశారు. అతడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఈ కాల్పుల ఘటన సెప్టెంబర్ 2వ తేదీన చోటు చేసుకుంది.

Canada: పంజాబీ గాయకుడి నివాసంపై కాల్పులు.. వీడియో విడుదల చేసిన పోలీసులు

అట్టావా, నవంబర్ 01: కెనడాలో పంజాబీ గాయకుడు ఏపీ ధిల్లాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియోను వాంకోవర్ పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన వాంకోవర్‌లోని ఏపీ ధిల్లాన్ నివాసంపై దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ఆయన నివాసంలోని రెండు వాహనాలకు నిప్పుంటించారు. అయితే ఈ కాల్పుల్లో గాయకుడు ఏపీ ధిల్లాన్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.


మరోవైపు ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న అభిజిత్ కింగ్రాను కెనడా పోలీసులు అంటారియోలో అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని అతడిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అభిజిత్ కింగ్రాను కోర్టులో హాజరుపరచనున్నామని కెనడా పోలీసులు వెల్లడించారు.


ఇక ఇదే కేసులో భారతీయుడు విక్రమ్ శర్మ కోసం పోలీసులు అరెస్ట్ వారెంట్‌ను సైతం జారీ చేశారు. కానీ అతడి ఫొటో మాత్రం విడుదల చేయలేదు. అయితే దక్షిణాసియాకు చెందిన వ్యక్తి అంటూ శర్మవివరాలను కెనడా పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం అతడు భారత్‌లో ఉండి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ఓ వీడియోకు ఏపీ ధిల్లాన్ సంగీతం సమకూర్చాడు. అలాగే పంజాబీలో చాలా పాపులర్ అయిన పలు గీతాలకు సైతం దిల్లాన్ సంగీతం అందించారు.


ఇంకోవైపు కెనడాలోని నగల వ్యాపారి నివాసంపై ఇటీవల కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సైతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనని పోలీసులు భావిస్తున్నారు. బిష్ణోయ్‌తో తనకు సంబంధం ఉందని గ్యాంగ్‌‌స్టర్ రోహిత్ గోదారా ఇప్పటికే చెప్పారు. అతడు సైతం ధిల్లాన్‌ను హత్య చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.


1990 దశకంలో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా హీరో సల్మాన్‌ఖాన్ రాజస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో వేటకు వెళ్లిన సల్మాన్‌ఖాన్.. కృష్ణ జింకను వేటాడారు. అయితే బిష్ణోయ్ వర్గం.. కృష్ణ జింకను ఆరాధిస్తారు. దీంతో నాటి నుంచి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌.. సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న సిద్ధూ మూసే వాలా, బాబా సిద్దిఖీలను ఈ గ్యాంగ్ కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

ఇక సల్మాన్ ఖాన్‌ను హత్య చేయకుండా ఉండేందుకు తమకు రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఈ గ్యాంగ్ సందేశం పంపినట్లు మీడియాలో ఓ ప్రచారం అయితే సాగుతుంది.

For International News And Telugu News..

Updated Date - Nov 01 , 2024 | 10:15 AM