7 గంటల్లో భూప్రదక్షిణ!
ABN , Publish Date - Nov 11 , 2024 | 06:00 AM
‘‘ఎనభై రోజుల్లో భూప్రదక్షిణ’’.. ఎప్పుడో విమానాలు లేని రోజుల్లో, 1872లో ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత జూల్స్‌వెర్న్ రాసిన కాల్పనిక నవల పేరు ఇది! ఆయన ఆ నవల రాసిన వందేళ్ల తర్వాత.. శబ్దం కన్నా ఎక్కువ వేగంతో (సూపర్‌సానిక్) ప్రయాణించే కంకార్డ్ విమానాలు గాల్లో ఎగిరాయి.
శబ్దానికి నాలుగు రెట్ల వేగంతో వెళ్లే విమానం
చైనా సంస్థ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ తయారీ!
శబ్దానికి 9 రెట్ల వేగంతో వెళ్లే విమానాల అభివృద్ధి దిశగా అమెరికన్ కంపెనీల కృషి
‘‘ఎనభై రోజుల్లో భూప్రదక్షిణ’’.. ఎప్పుడో విమానాలు లేని రోజుల్లో, 1872లో ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత జూల్స్‌వెర్న్ రాసిన కాల్పనిక నవల పేరు ఇది! ఆయన ఆ నవల రాసిన వందేళ్ల తర్వాత.. శబ్దం కన్నా ఎక్కువ వేగంతో (సూపర్‌సానిక్) ప్రయాణించే కంకార్డ్ విమానాలు గాల్లో ఎగిరాయి. 1986 నవంబరులో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ కంకార్డ్ విమానం.. 29 గంటల 59 నిమిషాల్లో భూప్రదక్షిణం చేసింది. ఇప్పుడు వాటినిమించి.. శబ్దవేగానికి ఐదు రెట్ల (హైపర్‌సానిక్) వేగంతో ప్రయాణించే విమానాల తయారీకి కృషి జరుగుతోంది. చైనాకు చెందిన ‘స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్’ కంపెనీ ఇటీవలే ఆ దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. శబ్దానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించే విమానాన్ని తయారుచేసింది. దాదాపుగా గంటకు 5 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానంలో భూప్రదక్షిణ చేయడానికి జస్ట్ 7 గంటలు పడుతుందంతే!!
శబ్దానికి ఐదు రెట్లు, అంతకుమించిన (మ్యాక్ 5) వేగంతో ఖండాలు దాటి దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించే హైపర్ సానిక్ క్షిపణులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయిగానీ.. అతి తక్కువ సమయంలో సుదూరతీరాలకు ప్రయాణికులను తీసుకెళ్లే వాణిజ్య హైపర్‌సానిక్ విమానాలు మాత్రం చాలాకాలంగా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. చైనాకు చెందిన ‘స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ (ఈ కంపెనీ చైనా నామధేయం.. ‘లింకాంగ్ టియాన్షింగ్ టెక్నాలజీ’)’ సంస్థ ఆ దిశగా ఒకడుగు ముందుకు వేసినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వార్తాసంస్థ ఇటీవల ఒక కథనాన్ని వెలువరించింది. ఈ కంపెనీ తయారుచేసిన వాణిజ్య విమాన నమూనా శబ్దానికి నాలుగు రెట్ల వేగాన్ని సాధించినట్టు అందులో పేర్కొంది. శబ్దవేగం గంటకు 1234.8 కిలోమీటర్లు.
దానికి నాలుగు రెట్లంటే.. దాదాపుగా గంటకు 5 వేల కిలోమీటర్లు. లండన్ నుంచి న్యూయార్క్‌కి కంకార్డ్ (సూపర్‌సానిక్) విమానంలో అయితే 2 గంటల 53 నిమిషాల సమయం పట్టేది. ఈ విమానంలో అయితే గంటన్నరలో వెళ్లిపోవచ్చు. అలాగే.. లండన్ నుంచి సిడ్నీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాల్లో అయితే సుమారుగా 22 గంటల సమయం పడుతుంది.
అదే ఈ చైనా కంపెనీ తయారుచేసిన విమానంలో అయితే కేవలం నాలుగు గంటల లోపే పడుతుందన్నమాట. ఈ విమానం 2027 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అంచనా. అన్నట్టు.. ఈ విమానికి సదరు చైనా కంపెనీ పెట్టిన పేరు యున్షింగ్. అంటే పరుగుతీయడం అని అర్థం. ఒక్క చైనా కంపెనీయేకాదు.. అమెరికాకు చెందిన వీనస్ ఏరోస్పేస్ కంపెనీ.. ‘స్టార్‌గేజర్’ అనే హైపర్‌సానిక్ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే ఈ విమానం.. మ్యాక్ 9 (శబ్దవేగానికి 9 రెట్లు) వేగంతో ప్రయాణిస్తుందని, ఢిల్లీ నుంచి లండన్‌కు కేవలం గంటలో వెళ్లిపోతుందని (ఇప్పుడు 9 నుంచి 10 గంటలు పడుతోంది) దాని రూపకర్తలు చెబుతున్నారు. అంటే.. సరదాగా మధ్యాహ్న భోజనం వేళకు తాజ్‌మహల్‌ని సందర్శించి సాయంత్రం లండన్‌లో బిగ్‌బెన్ గడియారాన్ని చూస్తూ టీ రుచిని ఆస్వాదించవచ్చన్నమాట. ఇలాగే.. అమెరికాకు చెందిన బూమ్‌సానిక్ సంస్థ కూడా హైపర్‌సానిక్ విమానాల తయారీకి చాలాకాలంగా కృషిచేస్తోంది.
పర్యావరణంపై ఆందోళన..
హైపర్‌సానిక్ విమానాలు అందుబాటులోకి రావడం వల్ల దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయేంత దగ్గరవుతాయన్నమాట నిజమేగానీ.. ఆ విమానాల నుంచి వెలువడే కాలుష్యం పర్యావరణపరమైన ఆందోళనలకు కారణమవుతోంది. నాసా అంచనాల ప్రకారం.. సూపర్‌సానిక్ జెట్ విమానాలు సంప్రదాయ విమానాలతో పోలిస్తే రెట్టింపు ఇంధనాన్ని వినియోగిస్తాయి. పోనీ అందుకు తగ్గట్టుగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులను మోసుకెళ్లగలవా? అంటే.. సాధారణ విమానాలతో పోలిస్తే వాటిలో తక్కువమంది మాత్రమే ప్రయాణించే వీలుంటుంది.