Boeing Cargo Plane: విమానం గాల్లో ఉండగా మంటలు.. ఆ లోపమే కారణం!
ABN , Publish Date - Jan 19 , 2024 | 04:21 PM
ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే.. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే.. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి అమెరికాలో చోటు చేసుకుంది. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు తెలిసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి అట్లాస్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 747-8 విమానం మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్యూర్టోరికాకు బయలుదేరింది. ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఇంతలోనే విమానానికి ఎడమవైపున ఉండే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉన్నప్పుడు ఈ లోపం తలెత్తడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని వెనక్కు తిప్పి, మియామీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఇంజిన్‌లో మంటలు చెలరేగిన వెంటనే.. విమాన సిబ్బంది అన్ని ప్రామాణిక విధానాలను అనుసరించి, సురక్షితంగా మియామీ ఎయిర్‌పోర్టుకి తిరిగొచ్చారని అట్లాస్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక కార్గో విమానమని, ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై తాము దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. కాగా.. ఈ బోయింగ్ విమానం నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ GEnx ఇంజిన్స్ ద్వారా నడుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.