Plane crash: విమానం కుప్పకూలి మలావీ ఉపాధ్యక్షుడితో సహా 9 మంది మృతి
ABN , Publish Date - Jun 11 , 2024 | 05:24 PM
తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా (51) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్యతో సహా విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ: తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీ (Malawi) ఉపాధ్యక్షుడు (Vice President) సౌలోస్ చిలిమా (51) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్యతో సహా విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం మంగళవారంనాడు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ఒకరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.
సంఘటన వివరాల ప్రకారం, మలావీ మాజీ అటార్నీ జనరల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చిలిమా సహా మరో తొమ్మిది మంది సైనిక విమానంలో ప్రయాణిస్తుండగా సోమవారం అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర నగరమైన జుజులో విమానం ల్యాండ్ కావడంలో విఫలమైంది. దీంతో రాజధాని లిలాంగ్వేకి తిరిగి రావాలని సందేశం అందింది. కానీ విమానం తిరిగి రాకుండానే అదృశ్యం కావడంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పర్వత ప్రాంతంలో విమానం శకలాలను కనుగొన్నారు. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడకపోవడంతో మలావీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇది అత్యంత హృదయవిదాకరమైన సంఘటన అని, ఈ విషయం తెలియజేయడానికి విచారం వ్యక్తం చేస్తున్నానని చక్వేరా తెలిపారు.