Bangladesh: హక్కులు అందరికీ సమానమే.. హిందూ ఆలయాన్ని సందర్శించిన ముహమ్మద్ యూనస్
ABN , Publish Date - Aug 13 , 2024 | 05:17 PM
బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆదేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనుస్ ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి హిందూ దేవాలయాన్ని మంగళవారంనాడు సందర్శించారు. హిందూ పెద్దలను కలుసుకున్నారు.
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆదేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనుస్ (Muhammad Yunus) ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి (Dhakeshwari) హిందూ దేవాలయాన్ని మంగళవారంనాడు సందర్శించారు. హిందూ పెద్దలను కలుసుకున్నారు. మత ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరి హక్కుల పరిరక్షణకు పాటుపడతామని భరోసా ఇచ్చారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్న యూనుస్ 2006లో నోబెల్ శాంతి అవార్డును సైతం గెలుచుకున్నారు.
ఢాకేశ్వరి నేషనల్ టెంపుల్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో యూనుస్ మాట్లాడుతూ, ప్రజలు సంయమనంతో ఉండాలని, పనితీరు ఆధారంగానే తమ ప్రభుత్వంపై ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి రావాలని సూచించారు. విద్యార్థుల నిరసనలు ఇటీవల తారాస్థాయికి చేరుకోవడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచివెళ్లడంతో తాత్కాలిక ప్రభుత్వ పగ్గాలను యూనుస్ చేపట్టారు. మైనారిటీ, మెజారిటీ జనాభా ప్రస్తావన లేకుండా అంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తూ ఆ దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఢాకేశ్వరి దేవాలయం సందర్శన సందర్భంగా బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్, మహానగర్ సర్బజనీన్ పూజా కమిటీ నేతలు సహా పలు హిందూ సంస్థల ప్రతినిధులను కలుసుకున్నారు. ''అందరికీ సమానమైన హక్కులున్నాయి. ఒకే హక్కు, ఒకే ప్రజగా మనం ఉన్నాం. మనలో మనకు తారతమ్యాలు లేవు. దయజేసి అందరూ మాకు సహకరించడం. సంయమనం పాటించండి. ఆ తర్వాత మేము ఏమి చేయగలిగాము, ఏమి చేయలేకపోయామనే దానిపై జడ్జిమెంట్ ఇవ్వండి. మేము విఫలమైతే అప్పుడు విమర్శించండి'' అని యూనుస్ ఈ సందర్భంగా కోరారు.
మైనారిటీలపై దాడులు అత్యంత హేమయని యూనుస్ ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ''వారు మన దేశ ప్రజలు కాదా? మీరు (విద్యార్థులు) ఈ దేశాన్ని కాపాడగలరు. అలాంటప్పుడు కొన్ని కుటుంబాలను కాపాడలేరా? వారంతా మన సోదరులు. మనమంతా కలిసికట్టుగా పోరాడదాం, కలిసికట్టుగా నిలుద్దాం'' అని యూనుస్ పిలుపునిచ్చారు.