Share News

Joe Biden: వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా నిర్ధారణ

ABN , Publish Date - Jul 18 , 2024 | 08:03 AM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బుధవారం ఆయనకు పాజిటివ్‌గా తేలిందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అయితే ఇబ్బంది ఏమీ లేదని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.

Joe Biden: వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా నిర్ధారణ
Joe Biden

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బుధవారం ఆయనకు పాజిటివ్‌గా తేలిందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అయితే ఇబ్బంది ఏమీ లేదని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. గతంలోనే వ్యాక్సిన్ తీసుకోవడంతో ఎలాంటి సమస్యా ఉండదని పేర్కొంది. లాస్ వెగాస్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత కొవిడ్-19 నిర్ధారణ అయిందని వైట్‌హౌస్ పేర్కొంది. డెలావేర్‌లోని నివాసంలో ఆయన ఐసోలేషన్‌లో ఉంటారని, అక్కడి నుంచే తన విధులను కొనసాగిస్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు.


తనకు కొవిడ్-19 నిర్ధారణ కావడంపై జో బైడెన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ మధ్యాహ్నం నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆరోగ్యపరంగా నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నేను కోలుకోవాలంటూ సందేశం పంపించిన అందరికీ ధన్యావాదాలు. కోలుకునేందుకు ఐసోలేషన్‌లో ఉంటాను. ఇంటి వద్ద నుంచే అమెరికా ప్రజల కోసం నా విధులు నిర్వహిస్తాను’’ అంటూ అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు.


కాగా జో బైడెన్ వయసు ప్రస్తుతం 81 సంవత్సరాలు. ఆయన వృద్ధా్ప్య సమస్యలతో బాధపడుతున్నారు. పలు సభలు, సమావేశాల్లో ఆయన తికమక పడుతూ విమర్శల పాలవుతున్నారు. అధ్యక్ష ఎన్నికలు-2024 నుంచి వైదొలగాలంటూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవలే హత్యాయత్నం జరిగిన విషయం తెలిసింది. ఆ తర్వాత ట్రంప్ ఆదరణ పెరిగిందని పలు సర్వేలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

దుబాయ్ యువరాణి సంచలనం.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భర్తకు విడాకులు

కుమ్మేయ్‌... అమ్మేయ్‌! జగన్‌ మార్కు కొత్త దందా

For more International News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 08:11 AM