Lok Sabha Elections: ‘ప్రజ్వల్’ ప్రభావమెంతో..?
ABN , Publish Date - May 07 , 2024 | 03:39 AM
దక్షిణాదిన టార్గెట్-50 అంటున్న బీజేపీకి కర్ణాటక అత్యంత కీలకం. మిగతా ఏ రాష్ట్రంలోనూ రెండంకెల స్కోరు దాటే పరిస్థితి లేని నేపథ్యంలో ఇక్కడ గెలిచే స్థానాలే ముఖ్యం.
కర్ణాటకలో నేడు 14 స్థానాల్లో పోలింగ్.. వీటిలో లింగాయత్‌ల ప్రాబల్యం అధికం
అన్నిచోట్లా కాంగ్రె్‌స-బీజేపీ ముఖాముఖి
జేడీఎస్ పోటీలో లేకున్నా ఇబ్బందికరమే?
పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ యత్నం
(సెంట్రల్ డెస్క్)
దక్షిణాదిన టార్గెట్-50 అంటున్న బీజేపీకి కర్ణాటక అత్యంత కీలకం. మిగతా ఏ రాష్ట్రంలోనూ రెండంకెల స్కోరు దాటే పరిస్థితి లేని నేపథ్యంలో ఇక్కడ గెలిచే స్థానాలే ముఖ్యం. అయితే, ఇటీవల జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల అంశం దేశాన్ని కుదిపేయడంతో పాటు కాంగ్రె్‌సకు ప్రచారాస్త్రంగా మారింది. జేడీఎస్‌తో పొత్తులో ఉండటంతో ఈ వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా.. జేడీఎస్‌కు పూర్తి అండగా నిలిచే ఒక్కళిగలు అధికంగా ఉండే దక్షిణ కర్ణాటకలో పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రజ్వల్ వ్యవహారాన్ని బయటపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 28 సీట్లకు గాను తొలి దశలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. మిగిలినవాటికి మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో జేడీఎస్ పోటీలో లేకపోయినప్పటికీ, ‘ప్రజ్వల్’ ప్రభావం బీజేపీపై తప్పక ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జేడీఎస్ పోటీ చేస్తున్న 3 సీట్లకు గత నెలలోనే పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్ జరిగే స్థానాల్లో ఎక్కువ శాతం ఉత్తర, సెంట్రల్ కర్ణాటకలో.. ప్రభావవంతమైన సామాజిక వర్గం లింగాయత్‌ల ప్రాబల్యంలోనివే. వీటిలోని కిట్టూర్ కర్ణాటక (ముంబై-కర్ణాటక)లో 30 ఏళ్లుగా బీజేపీకి గట్టి పట్టుంది. వెనుకబడిన కల్యాణ్ కర్ణాటక (హైదరాబాద్ కర్ణాటక)లో కాంగ్రె్‌స-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రె్‌సదే పైచేయి అయినా, రెండు దశాబ్దాలుగా బీజేపీ పుంజుకొంటోంది.
బీజేపీ నష్ట నివారణ చర్యలు
ప్రజ్వల్ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే తీవ్రంగా ఖండించడం ద్వారా బీజేపీ నష్ట నివారణకు దిగింది. కాగా, ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు రేవణ్ణ సెక్స్ కుంభకోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఇది ఏమేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. వాస్తవానికి ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ, జేడీఎస్ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడంతా మారిపోయింది. ప్రజ్వల్, ఆయన తండ్రి రేవణ్ణను కుమారస్వామి పూర్తిగా పక్కనపెట్టడం జేడీఎ్‌సను చీలికకు కారణం కానుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అయితే.. జేడీఎ్‌సకు చెందిన 19 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది తమ పార్టీలో చేరుతారని వ్యాఖ్యానించడం గమనార్హం.
సిటింగ్‌ల మార్పు.. మంత్రుల వారసులు
రెండో విడత పోలింగ్ జరగనున్న 14 స్థానాలనూ 2019లో బీజేపీనే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో సగంచోట్ల సిటింగ్ అభ్యర్థులను మార్చింది. కొప్పల్, ఉత్తర కన్నడ మరికొన్ని నియోజకవర్గాల ఎంపీలపై పార్టీ కేడర్‌లోనే వ్యతిరేకత ఉంది. ఇక కాంగ్రెస్ ఐదుచోట్ల రాష్ట్ర మంత్రుల కుమారులు లేదా కుమార్తెలను దింపడం గమనార్హం. మరో 3 స్థానాల్లో సీనియర్ నేతల వారసులకు, ఒకచోట రిటైర్డ్ ఐఏఎ్‌సకు టికెట్లిచ్చింది. వీరిలో ఒక్కరు తప్ప అందరూ కొత్తవారే. ఇది బీజేపీ-కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోలింగ్ జరిగే నియోజకవర్గాలు: చిక్కోడి, బెళగావి, బాగల్కోటె, ఉత్తర కన్నడ, బీదర్, రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయపుర, కలబురగి, దావణగెరె, శివమొగ్గ, హావేరి, ధారవాడ.
పోటీలోని ప్రముఖులు: మాజీ సీఎంలు బొమ్మై, శెట్టర్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని, మంత్రుల వారసులు సాగర్ ఖండ్రె, ప్రియాంక జార్కిహొళి, మృణాల్ హెబ్బాల్కర్, సంయుక్తా పాటిల్, మంత్రి మల్లికార్జున భార్య ప్రభ ఈ విడతలో పోటీలో ఉన్నారు. శివమొగ్గలో మాజీ సీఎంలు యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర, బంగారప్ప కోడలు గీతాశివరాజ్ తలపడుతున్నారు.
లింగాయత్‌ల అడ్డా
బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు లింగాయత్‌ల ప్రాబల్యం ఉత్తర కర్ణాటకలోనే అధికం. 2014 నుంచి 60ుపైగా లింగాయత్‌లు కమలం పార్టీ వైపే నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో అయితే 87ు మంది మద్దతు పలికారు. యడియూరప్పకు తిరిగి కీలక బాధ్యతలు అప్పగించడం, ఆయన కుమారుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలివ్వడం, లింగాయత్‌లైన ఇద్దరు మాజీ సీఎంలు శెట్టర్, బొమ్మైలు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తుండడంతో లింగాయత్‌ల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ భావిస్తోంది. కాగా, ఓబీసీలు కొన్నేళ్లుగా బీజేపీనే ఎక్కువ ఆదరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వారిని ఆకర్షించింది. దళితులు మాత్రం పూర్తిస్థాయిలో హస్తం వైపే ఉన్నారు. కల్యాణ్ కర్ణాటకలో ప్రభుత్వ పథకాలైన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఉధృతంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ మోదీ మేనియాను నమ్ముకుంది.