Share News

ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ

ABN , Publish Date - Sep 18 , 2024 | 06:32 AM

ఇటీవల తాను స్వయంగా ప్రకటించినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎంగా విద్యాశాఖ మంత్రి ఆతిశీ (43) బాధ్యతలు

ఢిల్లీ కొత్త సీఎం ఆతిశీ
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పిస్తున్న ఆతిశీ

శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న ఆప్‌ ఎమ్మెల్యేలు

ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్‌

అనంతరం ఎల్జీకి తన రాజీనామా

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరిన ఆతిశీ

రాష్ట్రపతి ఆమోదం రాగానే ప్రమాణం

షీలాదీక్షిత్‌, సుష్మాస్వరాజ్‌ తర్వాత

ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇటీవల తాను స్వయంగా ప్రకటించినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎంగా విద్యాశాఖ మంత్రి ఆతిశీ (43) బాధ్యతలు చేపట్టనున్నారు. కేజ్రీవాల్‌ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టటమే లక్ష్యంగా పని చేస్తానని ఆమె తెలిపారు. మంగళవారం ఉదయం కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆప్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొత్త సీఎంగా ఆతిశీ పేరును కేజ్రీవాల్‌ స్వయంగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఆతిశీ ఎన్నికయ్యారు. అనంతరం, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆతిశీ, ఆప్‌ నేతలతో కలిసి కేజ్రీవాల్‌.. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న లేఖను గవర్నర్‌కు ఆతిశీ అందజేశారు. కేజ్రీవాల్‌ రాజీనామాను, ఆతిశీ లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపిస్తారని, అవి ఆమోదం పొందగానే ప్రభుత్వ ఏర్పాటుకు, సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆతిశీని ఆహ్వానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 26-27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశాల్లోనే ఆతిశీ తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకునే అవకాశముంది.

కేజ్రీవాల్‌ మౌనం

మంగళవారం నాటి పరిణామాల మధ్య కేజ్రీవాల్‌ మీడియాతో ఏమీ మాట్లాడకుండా మౌనం దాల్చారు. ఆతిశీ విలేకర్లతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఎల్జీని కోరామన్నారు. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చిన తర్వాత వేరే ఏ నాయకుడైనా.. సీఎం పదవిని తనతోనే అట్టి పెట్టుకుంటారని, కానీ, కేజ్రీవాల్‌ మాత్రం ప్రజాకోర్టుకు వెళ్లటానికి నిర్ణయించి రాజీనామా చేశారని పేర్కొన్నారు. ‘కేజ్రీవాల్‌ నన్ను విశ్వసించి ఎమ్మెల్యేను, మంత్రిని, ఇప్పుడు సీఎంని చేశారు. ఆప్‌లోనే ఇది సాధ్యం’ అని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేజ్రీవాల్‌ను తిరిగి సీఎంను చేయటమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పని చేస్తానన్నారు. ‘‘మీ బిడ్డ, సోదరుడు అయిన కేజ్రీవాల్‌ను మళ్లీ సీఎంను చేయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీలో ఒకరే ముఖ్యమంత్రి. ఆయనే కేజ్రీవాల్‌’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఆతిశీ సీఎం పదవిని చేపట్టిన అనంతరం.. త్వరలోనే అసెంబ్లీని రద్దు చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నవంబరులో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లతోపాటు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కేజ్రీవాల్‌ కోరుకుంటున్న దృష్ట్యా.. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవచ్చని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఉంది. షెడ్యూల్‌ ప్రకారమైతే ఫిబ్రవరిలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.


ఢిల్లీకి మూడవ మహిళా సీఎం

ఆతిశీ సీఎంగా బాధ్యతలు చేపడితే.. ఢిల్లీలో ఆ పదవిని అధిష్ఠించిన మూడవ మహిళ అవుతారు. అత్యంత పిన్న వయసులో ఢిల్లీ సీఎం అయిన వ్యక్తిగానూ ఆమె రికార్డు సృష్టిస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ (1998 నుంచి 2013 వరకు), బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ (1998లో 52 రోజులపాటు) ఢిల్లీ సీఎంగా పని చేశారు. 15 ఏళ్లు ఏకధాటిగా ఢిల్లీని పాలించిన ఏకైక సీఎంగా షీలాదీక్షిత్‌ రికార్డు నెలకొల్పారు. ఆతిశీ.. కేజ్రీవాల్‌ క్యాబినెట్‌లో విద్య, ఆర్థికం, ప్రజాపనులు తదితర 14 శాఖలను నిర్వహించారు. కేజ్రీవాల్‌ జైలులో ఉన్నప్పుడు పార్టీని నడిపించారు. కాగా, కేజ్రీవాల్‌ ఆడుతున్న రాజకీయ క్రీడ విఫలం కానుందని ప్రతిపక్ష బీజేపీ ఎద్దేవా చేసింది. వ్యక్తిని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారదని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేందర్‌ సచ్‌దేవా తెలిపారు. ఆప్‌ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ప్రజలే వారికి గుణపాఠం నేర్పిస్తారని విమర్శించారు. మనీశ్‌ సిసోడియా ఒత్తిడితోనే కేజ్రీవాల్‌.. అతిషిని ముఖ్యమంత్రిగా నియమించారన్నారు. ఆతిశీని డమ్మీ సీఎంగా ఆప్‌ తిరుగుబాటు ఎంపీ స్వాతి మలివాల్‌ అభివర్ణించారు. ఆతిశీ కుటుంబం టెర్రరిస్టు అఫ్జల్‌ గురును ఉరితీయకుండా కాపాడేందుకు ప్రయత్నించిందని, ఈ మేరకు నాటి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిందని ఆరోపించారు. ’

తన రాజీనామా పత్రాన్ని ఢిల్లీ ఎల్జీ వినయ్‌ సక్సేనాకు అందజేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌


దేశంలో ఇప్పటిదాకా 16 మంది మహిళా సీఎంలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఢిల్లీ సీఎంగా ఆతిశీ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో.. దేశంలో మహిళా సీఎంలుగా పని చేసిన పలువురు నేతల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. భారత రాజకీయాల్లో పురుషాధిక్యం బలంగా ఉన్నా.. అనేక మంది మహిళామణులు రాజకీయవేత్తలుగా తమదైన ముద్ర వేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలు సుచేతా కృపాలాని దేశంలో తొలి మహిళా సీఎంగా నిలిచారు. ఈమె.. 1963 నుంచి 1967 వరకు యునైటెడ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వాన్ని నడిపించారు. తమిళనాడు సీఎంగా పనిచేసిన జయలలిత.. అమ్మగా.. అక్కడి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. దీదీగా ఆ రాష్ట్ర ప్రజల ఆప్యాయతను చూరగొన్నారు. సీఎంలుగా పనిచేసినవారిలో సుష్మా స్వరాజ్‌, మాయావతి, షీలా దీక్షిత్‌, వసుంధరా రాజె, మెహబూబా ముఫ్తీ ప్రముఖ మహిళా నేతలు. ప్రస్తుతం దేశంలో మమత ఒక్కరే మహిళా సీఎం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశంలో 16 మంది మహిళలు సీఎంలు అయ్యారు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఆతిశీ దేశంలో 17వ మహిళా సీఎం, ఢిల్లీకి మూడో మహిళా సీఎం కాబోతున్నారు.

Updated Date - Sep 18 , 2024 | 06:38 AM