Share News

NITI Aayog: నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాక్ అవుట్

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:33 PM

రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కొందరు..

NITI Aayog: నీతి ఆయోగ్ సమావేశం నుంచి  మమతా బెనర్జీ వాక్ అవుట్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కొందరు ముఖ్యమంత్రులు కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం.. కేంద్ర బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారని.. ఇదే అంశాన్ని నీతి ఆయోగ్‌ సమావేశంలో లేవనెత్తుతానంటూ సమావేశానికి హాజరయ్యారు. సీన్ కట్ చేస్తే సమావేశం ప్రారంభమైన కాసేపటికే ఆమె వాకౌట్ చేశారు. ఎందుకు.. ఏంటి? అంటారా?


సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారనేది మమతా బెనర్జీ ఆరోపణ. నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని సమావేశంలో ఆమె డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారట. వెంటనే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు సమావేశంలో 20 నిముషాలు మాట్లాడారని.. ఇతర నేతలు 15 నిముషాలు మాట్లాడారన్నారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైందని తాను ఒక్కరినేనని కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.


వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్‌ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చంద్రబాబు వివరించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను సైతం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలను చంద్రబాబు వివరించినట్టు సమాచారం. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను సైతం వివరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుతో వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిపినందుకు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

జగన్‌ పత్రికకు జనం సొమ్ము

Read more National News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 02:22 PM