Share News

Shashi Tharoor: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు, కానీ... శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 06:31 PM

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ సంచలన జోస్యం చెప్పారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని, అయితే మెజార్టీ మార్కు కంటే కిందకు పడిపోవచ్చని అన్నారు.

Shashi Tharoor: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు, కానీ... శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) విజయావకాశాలు, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ (Shashi Tharoor) సంచలన జోస్యం చెప్పారు. బీజేపీ అతిపెద్ద పార్టీ (Single largest party)గా అవతరించవచ్చని, అయితే మెజార్టీ మార్కు కంటే కిందకు పడిపోవచ్చని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న బీజేపీ ఆలోచనకు మెజారిటీ పడిపోవడం అవరోధం కావచ్చని చెప్పారు.


బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని ఎన్డీయే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బీజేపీపై ఐక్యపోరాటానికి కాంగ్రెస్, మరో 27 ప్రతిపక్ష పార్టీలు 'ఇండియా' కూటమిగా ఏర్పటి సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో శశిథరూర్ తాజా జోస్యం చెప్పారు. ''ఇప్పటికీ బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే వారు గెలిచే సీట్ల సంఖ్య తగ్గుతుంది. వారితో కలిసి ఉండటానికి భాగస్వామ్యపక్షాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అది ప్రతిపక్షాలకు లాభయాదయకంగా మారవచ్చు'' అని శశిథరూర్ విశ్లేషించారు.


'ఇండియా బ్లాక్' చాలినన్ని రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ ఒప్పందం చేసుకుంటే ఓటమి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య సీట్ల షేరింగ్ కుదరడం సాధ్యంకాదని ఆయన అన్నారు. కానీ, తమిళనాడులో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, డీఎంకే మధ్య పొత్తులున్నాయని, అవి కొనసాగుతాయనడంలో సందేహం లేదని చెప్పారు. గత ఎన్నికల్లో కూడా వారంతా కలిసే పోటీ చేశారని గుర్తుచేశారు.

Updated Date - Jan 14 , 2024 | 06:31 PM