Share News

Rameshwaram Cafe explosion: ముమ్మాటికీ బాంబు పేలుడే: తేజస్వి సూర్య

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:42 PM

టెక్నాలజీ హబ్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఘటనకు బాంబు పేలుడే కారణమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. కేఫ్‌ ఆవరణలో ఒక కస్టమర్ వదిలివెళ్లిన బ్యాగ్‌లోని పేలుడు పదార్ధమే ఇందుకు కారణమని, సిలెండర్ పేలుడు కాదని రామేశ్వరం కేఫ్ వ్యవస్థపాకుడు నాగరాజ్ తనకు తెలిపినట్టు చెప్పారు.

Rameshwaram Cafe explosion: ముమ్మాటికీ బాంబు పేలుడే: తేజస్వి సూర్య

బెంగళూరు: టెక్నాలజీ హబ్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో జరిగిన ఘటనకు బాంబు పేలుడే కారణమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejaswi Surya) అన్నారు. కేఫ్‌ ఆవరణలో ఒక కస్టమర్ వదిలివెళ్లిన బ్యాగ్‌లోని పేలుడు పదార్ధమే ఇందుకు కారణమని, సిలెండర్ పేలుడు కాదని రామేశ్వరం కేఫ్ వ్యవస్థపాకుడు నాగరాజ్ తనకు తెలిపినట్టు చెప్పారు. ఈ ఘటనలో కేఫ్ సిబ్బంది ఒకరు గాయపడ్డారన్నారు. ఇది చాలా స్పష్టంగా బాంబు పేలుడు కేసుగా తెలుస్తోందని, దీనికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం చెప్పాలని తేజస్వి సూర్య డిమాండ్ చేశారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


రంగంలోకి ఎన్ఐఏ

లంచ్ సమయంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు కేఫ్ సిబ్బంది సహా తొమ్మిది మంది గాయపడ్డారు. దీంతో ఘటనా స్థలికి పోలీసు టీమ్‌తో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చేరుకుంది. ఫోరెన్సిక్ టీమ్‌ కూడా రంగంలోకి దిగింది. పేలుడు అనంతరం ఎలాంటి మంటలు చెలరేగకపోవడంతో గ్యాస్ సిలిండర్ పేలినట్టు కనబడటం లేదని చెబుతున్నారు. పేలుడుకు ఐఈడీనే కారణమా అనే విషయంపై శాంపిల్స్ సేకరిస్తున్నామని, కేఫ్‌లో ఉంచిన బ్యాంగులోనే ఐఈడీ ఉంచారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక పోలీస్ చీఫ్ అలోక్ మోహన్ తెలిపారు. దీనిపై హోం డిపార్ట్‌మెంట్ అధికారికంగా సమాచారం ఇస్తుందని చెప్పారు.


జంట పేలుళ్లు..

కాగా, పది సెకెండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగిన తనకు సమాచారం వచ్చినట్టు కేఫ్ కో-వ్యవస్థాపకురాలు దివ్వ రాఘవేంద్రరావు తెలిపారు. వంటగదిలో ఎలాంటి పేలుడు జరగలేదన్నారు. కస్టమర్స్ చేతులు వాష్ చేసుకునే ప్రాంతంలో పేలుడు జరిగిందని, బహుశా అక్కడ ఉంచిన బ్యాగ్‌లో పేలుడు పదార్ధం ఉండొచ్చని చెప్పారు. గాయపడిన వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా ఆమె తెలిపారు. కాగా, మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పేలుడు జరగ్గానే అక్కడకు చేరుకున్నామని, నల్లటి పొగ కనిపించిందని, ఐదారుగురు గాయపడటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారని సబరీష్ కుండలి అనే స్థానికుడు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 06:42 PM