Share News

Bomb Threats: మరోసారి బాంబు బెదిరింపులు.. పోలీసులు అల‌ర్ట్‌..

ABN , Publish Date - Dec 13 , 2024 | 10:54 AM

ఢిల్లీ పాఠశాలలకు మరోసారి ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. వారంలో రెండోసారి స్కూల్స్‌కి ఫేక్ బాంబు బెదిరింపులు ఈ మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 4 స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Bomb Threats: మరోసారి బాంబు బెదిరింపులు.. పోలీసులు అల‌ర్ట్‌..

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఫేక్ బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని సుమారు 4 పాఠశాలలకు ఇవాళ (శుక్రవారం) బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో ఆయా స్కూళ్లలో తనిఖీలు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు. మెయిల్స్‌ అన్నీ ఒకే ఈ-మెయిల్‌ నుంచి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.


ఈస్ట్ కైలాష్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని భట్నాగర్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీనివాస్ పురిలోని కేంబ్రిడ్జ్ స్కూల్‌‌కు బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వార్డ్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో చాలా పేలుడు పదార్థాలు ఉన్నాయని... విద్యార్థులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించినప్పుడు వారి బ్యాగ్‌ను తరచుగా తనిఖీ చేయరని అన్నారు. ఒక రహస్య డార్క్ వెబ్ గ్రూప్ ఈ కార్యకలాపంలో పాల్గొంటుందని పోలీసులు తెలిపారు. స్కూల్స్‌లో పేరెంట్-టీచర్ సమావేశం, క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు మైదానంలో ఉన్నప్పుడు పేలుడు జరగవచ్చని ఈ మెయిల్‌లో ఆగంతకులు పేర్కొన్నారు. డిసెంబర్ 9న 44 స్కూల్స్‌కి ఈ మెయిల్ ద్వారా ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. 30 వేల డాలర్లు ఇవ్వకపోతే స్కూల్స్ పేల్చేస్తామని బెదిరించారు.ఫేక్ బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ ఐపీ అడ్రస్ న్యూయార్క్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.


ముమ్మర తనిఖీలు..

కాగా.. ఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాదాపు 40కిపైగా పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులు అందడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులను మళ్లీ ఇళ్లకు పంపివేశారు. అనంతరం ఆయా పాఠశాలల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇవి నకిలీ బెదిరింపుగా గుర్తించామని ఢిల్లీ పోలీస్ పీఆర్వో సంజయ్ త్యాగి వెల్లడించారు. అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అందులోభాగంగా బాంబు బెదిరింపులు అందిన ఈ మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


భద్రత కల్పిస్తాం: సంజయ్ త్యాగి

నగరంలోని అన్ని స్కూళ్లు, విద్యార్థులకు భద్రత కల్పిస్తామని ఈ సందర్బంగా సంజయ్ త్యాగి భరోసా ఇచ్చారు. డీపీఎస్ ఆర్కే పురం, జీడీ గోయోంకాతోపాటు దాదాపు 44 స్కూళ్లకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు అందాయని వివరించారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను ఇంటికి పంపి.. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందించాయని తెలిపారు. ఆదివారం రాత్రి 11.38 గంటలకు పాఠశాల భవనాల్లో పలు బాంబులు అమర్చినట్లు ఈ మెయిల్ ద్వారా పాఠశాలల యాజమాన్యాలకు బెదిరింపులు వచ్చాయన్నారు. ఈ బాంబులు పేలకుండా ఉండాలంటే.. రూ. 30 వేల యూఎస్ డాలర్లు తమకు అందజేయాలని ఈ మెయిల్ పంపిన వ్యక్తులు డిమాండ్ చేశారని వివరించారు.


అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన..

మరోవైపు దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితిపై మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. గతంలో ఈ తరహా ఘటనలు ఎప్పుడు లేవని గుర్తు చేశారు. దీనిపై ఢిల్లీ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని తన ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.


ఢిల్లీలో శాంతి భద్రతలు విఫలం: ముఖ్యమంత్రి అతిషి

ఇక ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అతిషి సైతం స్పందించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఇంతకు ముందెన్నడూ ఇలా లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ఘెరంగా విఫలమైందని ఆరోపించారు. ఇక ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం స్పందించారు. ఢిల్లీలో ఇంత భయానక స్థితిని తాము గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. తమ పిల్లలు సురక్షితంగా లేరనే విషయం.. తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుందన్నారు. ఢిల్లీలో బీజేపీ భయానక వాతావరణాన్ని సృష్టించిందని ఆయన ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలు కుప్పకూలాయని మనీశ్ సిసోడియా విమర్శించారు.


Also Read:

మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

తగ్గేదేలే అంటున్న పసిడి

మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 13 , 2024 | 10:57 AM