Share News

CM Yogi Adityanath : కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమాని పేరు ఉండాల్సిందే

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:06 AM

ఉత్తరప్రదేశ్‌లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం స్పష్టం చేశారు.

CM Yogi Adityanath :  కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమాని పేరు ఉండాల్సిందే

  • ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదేశం

  • ఇది భారత సంస్కృతిపై దాడి: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జూలై 19: ఉత్తరప్రదేశ్‌లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర పశ్చిమ యూపీలో దాదాపు 240 కిలోమీటర్ల పరిధిలో సాగుతుంది.

ఏటా శ్రావణ మాసంలో 11 రోజుల పాటు జరిగే యాత్రలో భాగంగా ఈసారి దాదాపు 3కోట్ల మంది భక్తులు హరిద్వార్‌కు కాలినడకన వెళ్లి, గంగానదీ జలాలను సేకరిస్తారని అంచనా. యాత్ర సాగే మార్గంలోని హోటళ్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంపై ముజఫర్‌నగర్‌ పోలీసులు స్పందించారు.

గతంలో యాత్ర మార్గంలో అన్ని రకాలైన ఆహార పదార్థాలను విక్రయించే కొందరు దుకాణదారులు...కావడిధారుల్లో గందరగోళం రేపి, శాంతిభద్రతల సమస్యలు సృష్టించే విధంగా తమ దుకాణాలకు పేర్లు పెట్టుకున్న ఘటనలు వెలుగు చూశాయని గుర్తుచేశారు. ఉపవాస దీక్షలో కావడి యాత్రకు వెళ్తున్న హిందువులకు స్వచ్ఛమైన శాకాహారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడానికి ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని బీజేపీ సమర్థించుకుంది.

అయితే, మతపరమైన విభేదాలను సృష్టించే ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని జేడీయూ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. కావడిధారులు ఎవరూ పొరపాటున కూడా ముస్లింలు నడిపే దుకాణాల్లో ఆహార పదార్థాలు కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనినే దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష అని, హిట్లర్‌ జర్మనీలో ‘యూదుల బాయ్‌కాట్‌’ అని పిలిచేవారని ధ్వజమెత్తారు. దీనిని భారత సంస్కృతిపై దాడిగా కాంగ్రెస్‌ అభివర్ణించింది.

Updated Date - Jul 20 , 2024 | 04:07 AM