Congress: అప్పటిలోపు కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రజా సమస్యలే ప్రధాన అజెండా: శశి థరూర్
ABN , Publish Date - Jan 28 , 2024 | 09:24 AM
లోక్ సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్(Congress) పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మేనిఫెస్టోని(Congress Manifesto) రూపొందించడానికి ఇప్పటికే ఓ కమిటీ వేసింది.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్(Congress) పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మేనిఫెస్టోని(Congress Manifesto) రూపొందించడానికి ఇప్పటికే ఓ కమిటీ వేసింది. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) జనవరి 27న మాట్లాడుతూ.. ఇండియా కూటమి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన చేపడుతుందని అన్నారు. మేనిఫెస్టో తొలి ముసాయిదా ఫిబ్రవరి 15నాటికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
"మేనిఫెస్టో రూపకల్పనలో మా విధానాలు మాకు ఉన్నాయి. మొదటి ముసాయిదా ఫిబ్రవరి 15 నాటికి సిద్ధమవుతుంది. తర్వాత దానిని మా వర్కింగ్ కమిటీ ఆమోదించాలి. ఈసీ ఎన్నికలను తేదీలను ప్రకటించే సమయానికి మేనిఫెస్టో సిద్ధంగా ఉంటుంది. కూటమి సభ్యుల అభిప్రాయాలు అందులో ప్రతిబింబిస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నాం. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయం పెంపు, మహిళల హక్కులు, యువత, రైతుల సమస్యలు తదితర అంశాలను ఇందులో పొందుపరుస్తాం. " అని ఆయన అన్నారు.