Share News

Roose Avenue Court : కేజ్రీవాల్‌కు బెయిల్‌

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:20 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట..! మద్యం కుంభకోణం కేసులో సరిగ్గా 3 నెలల కింద అరెస్టయిన ఆయనకు ఎట్టకేలకు రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది.

Roose Avenue Court : కేజ్రీవాల్‌కు బెయిల్‌

  • మద్యం కేసులో ఢిల్లీ కోర్టు మంజూరు

  • దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దు

  • సాక్షులను ప్రభావితం చేయొద్దు

  • పిలిచినపుడు కోర్టుకు రావాలి

  • పలు షరతులు పెట్టిన న్యాయస్థానం

  • నేడు జైలు నుంచి ఆప్‌ చీఫ్‌ విడుదల

  • సత్యమేవ జయతే..: ఢిల్లీ మంత్రి అతిశీ

న్యూఢిల్లీ, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట..! మద్యం కుంభకోణం కేసులో సరిగ్గా 3 నెలల కింద అరెస్టయిన ఆయనకు ఎట్టకేలకు రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు వెకేషన్‌ జడ్జి నియాయ్‌ బిందు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దని, విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, పిలిచినపుడు కోర్టుకు రావాలని పలు షరతులు విధించారు.

కేజ్రీ బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి గురువారం తీర్పును రిజర్వు చేసిని ఉదయం జడ్జి నియాయ్‌ బిందు.. సాయంత్రానికి బెయిల్‌ ఇచ్చారు. బెయిల్‌ బాండ్‌ పత్రాలపై సంతకం చేసేందుకు 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డర్‌ను నిలిపివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విజ్ఞప్తి చేసింది. తీర్పును పై కోర్టులో సవాల్‌ చేసుకునే వీలు కలుగుతుందని పేర్కొంది. ఈ వాదనను జడ్జి తిరస్కరించారు. కాగా, దాదాపు రెండు రోజుల పాటు ఈడీ, కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత బెయిల్‌ మంజూరు చేయాలని ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. కేజ్రీ తరఫు న్యాయవాదులు శుక్రవారం బెయిల్‌ బాండ్‌ పత్రాలను కోర్టుకు సమర్పించున్నారు. అనంతరం ఆయన తిహాడ్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. మరోవైపు కేజ్రీకి బెయిల్‌ మంజూరును ఈడీ ఎగువ కోర్టులో సవాల్‌ చేసే వీలుంది.


సరిగ్గా మూడు నెలల కిందట

మద్యం కుంభకోణంలో కేజ్రీని మార్చి 21న ఈడీ ఆరెస్టు చేసింది. లిక్కర్‌ వ్యాపారుల నుంచి పొందిన ముడుపులను గోవాలో పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించారని అభియోగాలు మోపింది. మనీ ల్యాండరింగ్‌ ద్వారా ఈ నిధులను మళ్లించారని, ఆప్‌ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌ ఇందుకు బాధ్యులని పేర్కొంది. దీనికిముందు గత ఏడాది అక్టోబరు-ఈ ఏడాది మార్చి మధ్య 9 సార్లు సమన్లు జారీ చేసింది. సమన్లకు ఆయన స్పందించడం లేదంటూ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టు.. కేజ్రీకి సమన్లు ఇచ్చింది. మార్చి 15న.. సమన్లను దాటవేయడంపై కేజ్రీ మీద విచారణను నిలిపివేసేందుకు సెషన్స్‌ కోర్టు నిరాకరించింది. ఇక అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు మార్చి 21న ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో.. అదే రోజు కేజ్రీని ఈడీ అదుపులోకి తీసుకుంది. కస్టడీ అనంతరం తిహాడ్‌ జైలుకు తరలించగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీకి మే 10న సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఈ నెల 1తో దీని గడువు ముగిసింది. జూన్‌ 2న ఆయన తిహాడ్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. పలు కారణాలతో ఢిల్లీ కోర్టును మధ్యంతర బెయిల్‌ కోరగా, 5వ తేదీన తిరస్కరించింది. కింది కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఎట్టకేలకు ఫలితాన్ని సాధించారు. కాగా, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా.. చివరకు సత్యానిదే గెలుపని ఢిల్లీ మంత్రి అతిశీ వ్యాఖ్యానించారు. ఆప్‌ ఇతర నేతలు సైతం తాజా పరిణామం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు కేజ్రీకి బెయిల్‌ మంజూరు నేపథ్యంలో ఢిల్లీ మద్యం స్కాంలో మిగతా నిందితులకూ త్వరలో బెయిల్‌ లభించే అవకాశం ఉందనే అభిప్రాయం న్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 21 , 2024 | 05:20 AM