Share News

Supreme Court: ఆ వీడియోలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

ABN , Publish Date - Sep 23 , 2024 | 11:40 AM

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు డౌన్‌లోడ్ చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

Supreme Court: ఆ వీడియోలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు డౌన్‌లోడ్ చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ విషయంలో హైకోర్టు పెద్ద తప్పిదం చేసిందని బెంచ్ వ్యాఖ్యానించింది. పిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకొచ్చిన ఈ కఠిన చట్టంపై సుప్రీంకోర్ట్ ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది.

కాగా తన మొబైల్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసిన ఓ 28 ఏళ్ల యువకుడిపై కేసు నమోదవగా.. అతడిపై ఉన్న అభియోగాలను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్‌లను కూడా రద్దు చేసింది. నేటి పిల్లలు అశ్లీల వీడియోలను చూడటం అనే తీవ్రమైన సమస్యతో ఇబ్బందిపడుతున్నారని, వారిని శిక్షించే బదులు విద్యాబుద్ధులు నేర్పించేలా సమాజం పరిణతి చెందాలని మద్రాస్ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా నేడు సుప్రీంకోర్ట్ తీర్పు వెలువడింది. నిందిత యువకుడిపై క్రిమినల్ ప్రొసిడింగ్స్‌ను తిరిగి కొనసాగించాలని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.


సుప్రీం తీర్పులో ఏముంది?

చిన్న పిల్లల అశ్లీలతో ముడిపడిన మెటీరియల్‌ను స్టోర్ చేసుకుంటే పోక్సో చట్టంలోని సెక్షన్ 15 వర్తిస్తుందని, శిక్ష పడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘పిల్లలకు సంబంధించిన ఏదైనా అశ్లీల మెటీరియల్‌ను స్టోర్ చేసిన వ్యక్తి దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయకపోయినా, దానిని తొలగించకుండా ఉంటే కనీసం రూ.5000 జరిమానాతో పాటు శిక్ష పడుతుంది. ఇదే పునరావృతమైతే రూ.10,000 తక్కువ కాకుండా జరిమానాతో పాటు శిక్ష పడుతుంది. ఒకవేళ సదరు మెటీరియల్‌ను మరింత వ్యాపింపజేస్తే జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఏదైనా వాణిజ్య ఉద్దేశంతో పిల్లల అశ్లీల వీడియోలను స్టోర్ చేసినట్టైతే 7 ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది’’ అని సుప్రీంకోర్ట్ హెచ్చరింది. ఈ సందర్భంలో చేసిన నేరం కన్నా.. నేరం వెనుక ఉన్న ఉద్దేశం అసలు నేరపూరిత చర్య అవుతుందని జస్టిస్ పార్దివాలా స్పష్టం చేశారు. ఈ తీర్పును జస్టిస్ పార్దివాలా రాశారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీజేఐ డీవై చంద్రచూడ్‌కు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు.

పిల్లలపై చైల్డ్ పోర్నోగ్రఫీ ఏవిధంగా ప్రభావం చూపుతోందనేదానిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేశామని, పోక్సోకు సవరణ తీసుకురావాలని పార్లమెంటుకు సూచించామని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.


ఇవి కూడా చదవండి

తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం

గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం.. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభ్యం

Updated Date - Sep 23 , 2024 | 12:08 PM