Election commission: ఖర్గేపై ఈసీ మండిపాటు..
ABN , Publish Date - May 11 , 2024 | 04:38 AM
ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసిన పోలింగ్ వివరాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు రాసిన లేఖల్లో ఆరోపించడంపై ఈసీ తీవ్రంగా స్పందించింది.
న్యూఢిల్లీ, మే 10: ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసిన పోలింగ్ వివరాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు రాసిన లేఖల్లో ఆరోపించడంపై ఈసీ తీవ్రంగా స్పందించింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే ఎన్నికలపై ఓటర్లలోనూ, రాజకీయ పార్టీల్లోనూ సందేహాలు లేవనెత్తి.. తప్పుదారి పట్టించేందుకు, గందరగోళం, అడ్డంకులు సృష్టించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
ఖర్గే లేఖ నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియపై సందేహాలు లేవనెత్తడంతోపాటు అసమ్మతిని, అరాచక పరిస్థితిని సృష్టించగలదని పేర్కొంది. ఖర్గే ఆరోపణలను ఎన్నికల ప్రక్రియపై దాడిగా అభివర్ణించింది. మొదటి దశలో పోలింగ్ శాతాన్ని 5.5 శాతం, రెండో దశలో 5.74 శాతం పెంచేశారని, ఆ వివరాల విడుదలలోనూ జాప్యం చేశారని ఖర్గే చేసిన ఆరోపణలనూ ఈసీ ఖండించింది. కాగా, ఖర్గే లేవనెత్తిన అంశాలపై ఈసీ స్పందించిన తీరు తీవ్ర విచారకరమని కాంగ్రెస్ ఆక్షేపించింది.