Share News

Election Commission : 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:00 AM

రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1).. హరియాణాలో అక్టోబరు 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం వెల్లడించింది.

 Election Commission : 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా

  • జమ్ముకశ్మీర్‌, హరియాణా షెడ్యూల్‌ విడుదల

  • జమ్ముకశ్మీర్‌కు సెప్టెంబరు 18 నుంచి 3 దశల్లో..

  • హరియాణాకు అక్టోబరు 1న.. 4న ఫలితాలు

  • మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఢిల్లీకి తర్వాత?

  • బహుశా వారి బాస్‌ మహారాష్ట్ర ఎన్నికలకు ఇంకా అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు: ఆదిత్య ఠాక్రే

న్యూఢిల్లీ, ఆగస్టు 16: రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1).. హరియాణాలో అక్టోబరు 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం వెల్లడించింది. అక్టోబరు 4న కౌంటింగ్‌ జరిపి ఫలితాలను ప్రకటించనున్నట్టు తెలిపింది. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం తర్వాత.. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

చివరిసారిగా అక్కడ 2014లో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఏర్పాటైన పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం 2018లో పడిపోయింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోదీ 2.0 సర్కారు ఏర్పాటయ్యాక.. 2019 ఆగస్టు 5న.. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను రద్దు చేసింది. ఆ నిర్ణయం సరైనదేనని పేర్కొంటూ గత ఏడాది డిసెంబరులో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.. ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని ఆదేశించింది.


ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్‌ షెడ్యూలు ప్రకటించింది. అయితే, మూడో దశ ఎన్నిక.. అక్టోబరు 1న, అంటే సుప్రీంకోర్టు పెట్టిన గడువు (సెప్టెంబరు 30) తర్వాత జరగడంపై కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన.. కోర్టు తీర్పునిచ్చింది 2023 డిసెంబరులో అని, ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలువచ్చాయని గుర్తుచేశారు.

ఆ ఎన్నికల ప్రక్రియ జూన్‌ 4 నాటికి ముగిసిందని.. ఆ తర్వాత వాతావరణం బాగోలేదని, అమర్‌నాథ్‌యాత్ర మొదలైందని.. ఆ యాత్ర ఆగస్టు 19న ముగుస్తోందని పేర్కొన్నారు. కశ్మీర్‌లో పండగల సీజన్‌, యాపిల్స్‌ సీజన్‌, ట్యులిప్స్‌ సీజన్‌.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ తేదీలు ఎంపిక చేశామని చెప్పారు. ఒక్కరోజు అటూ ఇటూ అవడం పెద్ద విషయమేమీ కాదని.. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు

. అయినా, ఈ ఎన్నికలు సుప్రీం పెట్టిన గడువులోపే మొదలవుతున్నాయని.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ముగుస్తాయని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణను తామేమీ ఆలస్యం చేయలేదని తేల్చిచెప్పారు. జమ్ముకశ్మీర్‌లో 90 లక్షల మంది రిజిస్టర్డ్‌ ఓటర్లున్నారని.. ఈ ఏడాది అక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 58.46 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని.. ఇది మూడున్నర దశాబ్దాల గరిష్ఠమని గుర్తుచేశారు. కాగా, జమ్ముకశ్మీర్‌ మొత్తం 90 స్థానాలకుగాను.. సెప్టెంబరు 18న తొలి దశలో 24 స్థానాలకు, రెండో దశలో 26 సీట్లకు.. మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.


మహారాష్ట్రలో ఇప్పుడే కాదు!

గత మూడు దఫాలుగా (2009, 2014, 2019) హరియాణాతోపాటే మహారాష్ట్రలోనూ ఎన్నికలు నిర్వహించారు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు హరియాణాతోపాటే అక్కడ కూడా ఎన్నికలు జరపాలి. కానీ మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూలు ప్రకటించలేదు. దీనిపై సీఈసీని ప్రశ్నించగా.. జమ్ముకశ్మీర్‌లో భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉందని.. మహారాష్ట్రలో ప్రస్తుతం వానాకాలం కారణంగా ఓటర్ల జాబితా అప్‌డేట్‌ చేయడం ఆలస్యమవుతోందని.. దీనికితోడు పితృపక్షాలు, వినాయక చవితి, దీపావళి వంటి పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సీజన్‌ నడుస్తోందని.. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూలును తర్వాత ప్రకటిస్తామని సమాధానమిచ్చారు.

ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాక.. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఢిల్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. కాగా.. మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించకపోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ చెప్పిన కారణాలపై శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘‘బహుశా వారి బాస్‌ (కేంద్రప్రభుత్వం) మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు’’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

‘‘మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజ్యాంగవిరుద్ధమైన, చట్టవిరుద్ధమైన బీజేపీ-మింధే సర్కారుకు కొనసాగే నైతిక అర్హత లేదు. ప్రజలు వారిని ఒకసారి తిరస్కరించారు. మళ్లీ తిరస్కరిస్తారు. అందుకే ఈసీ వారికి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి, రాష్ట్రాన్ని లూటీ చేయడానికి వారి కాంట్రాక్టర్లకు సమయం ఇస్తోంది’’ అని దుయ్యబట్టారు.

మరోవైపు.. ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు 12 గంటల ముందు జమ్ముకశ్మీర్‌లో భారీస్థాయిలో 198 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వీరిలో ఐదుగురు డిప్యూటీ కమిషనర్లు, 10 మంది సీనియర్‌ సూపరింటెండెంట్స్‌ ఆఫ్‌ పోలీస్‌ సహా 83 మంది పోలీసు అధికారులున్నారు.

Updated Date - Aug 17 , 2024 | 05:00 AM