Share News

Rahul Gandhi: రైతులు ఎంఎస్‌పీ, యువత ఉద్యోగాలు అడుగుతున్నారు మోదీజీ.. ప్రధానిపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Apr 11 , 2024 | 07:33 PM

రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర(MSP) అడుగుతుండగా.. యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని.. వారి ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు.

Rahul Gandhi: రైతులు ఎంఎస్‌పీ, యువత ఉద్యోగాలు అడుగుతున్నారు మోదీజీ.. ప్రధానిపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

జైపుర్: రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర(MSP) అడుగుతుండగా.. యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని.. వారి ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. మోదీపై(PM Modi) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

WhatsApp: వాట్సప్‌లో అందుబాటులోకి ఏఐ చాట్‌బాట్ ఫీచర్.. ఇలా చెక్ చేసుకోండి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ధరల పెరుగుదలతో సామాన్యులు అరిగోసలు పడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి ధరలు అదుపులోకి తేవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దలు పట్టించుకోవట్లేదు. మరోవైపు రైతులు ఎంఎస్‌పీ కోసం డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు యువత ఉద్యోగాలు ఇవ్వండి అని కోరుతున్నారు. వారి ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోవట్లేదు.


దేశంలో ప్రధానంగా ఉన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను మీడియా చూపించదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజాసంక్షేమాన్ని మరిచిని బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి.

ఇది వెనుకబడిన, దళితులు, గిరిజనులు, సాధారణ వర్గాల ప్రజల ఎన్నిక. దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల యజమానుల జాబితాలో వెనుకబడిన, గిరిజన, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు కనిపించరు. మీడియాను కేవలం 15-20 మంది మాత్రమే నియంత్రిస్తున్నారు. వారు ప్రధాని మోదీనే పగలు, రాత్రి చూపిస్తున్నారు. వారికి ప్రజా సమస్యలు పట్టవు. అందుకే సమస్యలను చూపించరు" అని రాహుల్ విమర్శించారు.


పారిశ్రామికవేత్తల రుణాలతో మాఫీపై..

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బడా పారిశ్రామికవేత్తల నుంచి బీజేపీ డబ్బులు తీసుకుంటోందని రాహుల్ ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని అన్నారు. రానున్న ఎన్నికలు దేశంలోని పేద ప్రజలకు, 22-25 మంది బిలియనీర్లకు మధ్య జరిగే పోరు అని ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీని 15-20 మంది పారిశ్రామికవేత్తల లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు.

మాఫీ చేసిన సొమ్ముతో 24 సంవత్సరాల పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించవచ్చని రాహుల్ అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా రైతులు పన్నులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో ప్రచారం సందర్భంగా రాహుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2024 | 07:33 PM