Share News

Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం

ABN , Publish Date - Jul 08 , 2024 | 02:01 PM

ఝార్ఖండ్ అసెంబ్లీ‌లో నిర్వహించిన బల పరీక్షలో జేఎంఎం నేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెగ్గారు. సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో స్పీకర్ రవీంద్రనాథ్ మెహతో సమక్షంలో ఈ బల పరీక్షను నిర్వహించారు.

Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం

రాంచీ, జులై 08: ఝార్ఖండ్ అసెంబ్లీ‌లో నిర్వహించిన బల పరీక్షలో జేఎంఎం నేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెగ్గారు. సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో స్పీకర్ రవీంద్రనాథ్ మెహతో సమక్షంలో ఈ బల పరీక్షను నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం హేమంత్ సోరెన్‌కు అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాంతో ఈ విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ నెగ్గారు. అయితే మరికొద్ది గంటల్లో సీఎం హేమంత్ సోరెన్.. తన కేబినెట్‌ను విస్తరించే అవకాశముందని సమాచారం.

ఈ ఏడాది జనవరి 31వ తేదీన భూ కుంభకోణంలో.. మని లాండరింగ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు మధ్యంతర బెయిల్ కోసం పలుమార్లు ఆయన కోర్టులను ఆశ్రయించారు. చివరకు లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలంటూ ఆయన కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేసినా.. హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజురు కాలేదు.


అలాంటి వేళ జూన్ 28వ తేదీన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజురు చేయడంతో...ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇక హేమంత్ సోరెన్ మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలించాయి. దీంతో ఆ రాష్ట్ర సీఎం చంపాయి సోరెన్.. తన పదవి రాజీనామా చేశారు. దాంతో జులై 4వ తేదీన ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఝర్ఖండ్‌‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చకు 27 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ప్రతిపక్షం బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు.. లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 76కి తగ్గింది.


మరోవైపు త్వరలో ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీతోపాటు ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలను ఓడించాలని జైలు నుంచి విడుదలైన జేఎంఎం నేత హేమంత్ సోరెన్ తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు ఝార్ఖండ్‌లో మొత్తం 14 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రికి ఎన్నికల్లో బీజేపీ 8, జేఎంఎం 3, కాంగ్రెస్ పార్టీ 2, ఏజేఎస్‌యూ 1 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి.

Read Latest News And National News

Updated Date - Jul 08 , 2024 | 08:30 PM