స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే.. ఎల్లప్పుడూ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులని కాదు
ABN , Publish Date - Nov 06 , 2024 | 03:15 AM
స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే అర్థం.. ఎల్లప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వాలని కాదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, నవంబరు 5: స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే అర్థం.. ఎల్లప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వాలని కాదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఒక ఆంగ్ల పత్రిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎలక్ర్టానిక్ మీడియాను ఉపయోగించుకొని కోర్టులపై ఒత్తిడి తేవడం ద్వారా అనుకూలమైన తీర్పులు పొందేందుకు ‘ప్రెజర్ గ్రూపులు’ ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ‘సంప్రదాయకంగా స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి స్వతంత్రంగా ఉండడమనే నిర్వచనం ఉంది. ఇప్పుడు స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే ప్రభుత్వం నుంచి కూడా స్వతంత్రత అని అర్థం. అయితే, చాలా ప్రెజర్ గ్రూపులు జడ్జిల నిర్ణయం తమకు అనుకూలంగా వచ్చినప్పుడు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉందని అభివర్ణిస్తుంటాయి. అనుకూలంగా రాకపోతే స్వతంత్రత లేదంటున్నాయి. నా అభ్యంతరం ఇదే. స్వతంత్రంగా ఉండటం అంటే.. తన మనస్సాక్షి ఏమి చెబుతోందో ఆ ప్రకారమే జడ్జి స్వతంత్రంగా నిర్ణయించాలి. ఆ మనస్సాక్షి కూడా చట్టం, రాజ్యాంగం మార్గదర్శకంలో ఉండాలి’ అని తేల్చిచెప్పారు.