Supreme Court: విచారణ సమయంలో రాజకీయాలు చేయొద్దు.. పశ్చిమబెంగాల్ కేసులో సుప్రీం సూచన
ABN , Publish Date - May 09 , 2024 | 08:21 AM
కోర్టుల్లో వాదనల సమయంలో రాజకీయ అంశాలను ప్రస్తావించొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) సూచించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ: కోర్టుల్లో వాదనల సమయంలో రాజకీయ అంశాలను ప్రస్తావించొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) సూచించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
బెంగాల్‌లో సీబీఐకి అనుమతి ఉపసంహరించినా.. సందేశ్ ఖాలీలాంటి కేసుల్లో దర్యాప్తు సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తోందని ఆరోపిస్తూ మమతా సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ కేసుపై విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తాము చట్టపర అంశాలను మాత్రమే నిర్ణయిస్తామని.. రాజకీయ వాదనలకు కేంద్రం, రాష్ట్రాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. దీదీ సర్కార్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. 2018 నవంబరు 16నే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐపై అనుమతి ఉపసంహరించుకుందని, మళ్లీ విచారణ పేరుతో సీబీఐను రాష్ట్రంలోకి అనుమతించడం సరికాదన్నారు. సీబీఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి తప్పనిసరి అని అన్నారు. సమ్మతి ఇవ్వడం ఒక ప్రత్యేక హక్కు అని, ఆ హక్కును అనుమతించే అధికారం రాష్ట్రానికి ఉందని సిబల్ వాదించారు.
కేంద్రం తరఫున తుషార్ మెహతా..
కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. సీబీఐ దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం లేదా దాని శాఖలు ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణను కలిగి ఉండవని అన్నారు. సీబీఐలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని చెప్పడం సరికాదని, ఒక నిర్దిష్ట నేరానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని మెహతా పేర్కొన్నారు.
ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తుషార్ మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు. అటు కపిల్ సిబల్, ఇటు తుషార్ మెహతా వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ సమయంలో రాజకీయాలు చేయొద్దని సూచించింది.
Read Latest News and National News click here..