Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 15 , 2024 | 06:48 PM
లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన 'ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్'పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఏఎన్ఐ' వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సూటిగా సమాధానమిచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తు్న్నాయని విమర్శించారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన 'ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్' (Electoral Bonds Scheme)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 'ఏఎన్ఐ' వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సూటిగా సమాధానమిచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తు్న్నాయని విమర్శించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ పథకాన్ని తాము తీసుకువచ్చామని, నిజాయితీగా అంగీకరించినప్పుడు వాళ్లు పశ్చాత్తాప పడతారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఈ పథకాన్ని గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది.
''నిర్ణయాలు తీసుకోవడంలో లోటుపాట్లు ఉండవని నేను ఎప్పుడూ చెప్పలేదు. లోటుపాట్లు ఉంటే వాటిపై చర్చించి మెరుగుపరుచుకుంటాం. ఈ విషయంలోనూ (ఎలక్టోరల్ బాండ్ల పథకం) మెరుగుపరచుకునేందుకు ఎంతో అవకాశం ఉంది. ఈరోజు దేశాన్ని నల్లధనం వైపు మనం నెట్టేశాం. ఇది పశ్చాత్తాపపడాల్సిన విషయం. నిజాయితీ వాళ్లు ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతారు'' అని మోదీ ఈ ఇంటర్వ్యులో తన అభిప్రాయాన్ని స్పష్టంచేశారు.
Lok Sabha polls 2024: సంఘవ్యతిరేకులతో రాహుల్ 'రహస్య ఒప్పందం'... మోదీ ఘాటు విమర్శ
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును విపక్ష పార్టీలు, పౌర సమాజం కార్యకర్తలు స్వాగతించారు. ఈ పథకం కింద అత్యధికంగా నిధులు అందుకున్న పార్టీలో బీజేపీ మొదటి స్థానంలో ఉందని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ స్కీమ్ ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడి అత్యధిక విరాళాలు అందుకుందని విపక్ష 'ఇండియా' కూటమి ఆరోపించగా, కేంద్రం పారదర్శకంగానే స్కీమ్ ప్రవేశపెట్టిందని, తమ కంటే విపక్ష కూటమికి వచ్చిన విరాళాలే ఎక్కువని బీజేపీ స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి