PM Modi: సుధామూర్తి తొలి ప్రసంగంపై మోదీ ప్రశంసలు.. ఆమె ఫస్ట్ స్పీచ్ ఇదే
ABN , Publish Date - Jul 03 , 2024 | 03:02 PM
రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) తొలి ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సుధా మూర్తి మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. తల్లి చనిపోయినప్పుడు ఆసుపత్రిలో ఒకరి మరణం నమోదు చేస్తారని, కానీ ఓ కుటుంబానికి ఆ తల్లి ఎప్పటికీ దూరమైనట్లే అని పేర్కొన్నారు.
ఢిల్లీ: రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) తొలి ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సుధా మూర్తి మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు.
తల్లి చనిపోయినప్పుడు ఆసుపత్రిలో ఒకరి మరణం నమోదు చేస్తారని, కానీ ఓ కుటుంబానికి ఆ తల్లి ఎప్పటికీ దూరమైనట్లే అని పేర్కొన్నారు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి చర్చించినట్లు వివరించారు. మహిళల ఆరోగ్యం గురించి సవివరంగా మాట్లాడిన సుధామూర్తికి కృతజ్ఞతలు చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు.
ఆ సమయంలో సుధామూర్తి లేచి నిలబడి ప్రధానికి నమస్కరించారు. మాతృత్వంపై సుధా మూర్తి భావోద్వేగంగా ప్రసంగించారని మోదీ అన్నారు. గత పదేళ్లలో మహిళల ఆరోగ్యం ప్రాధాన్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు ఇందులో భాగంగా మరుగుదొడ్లు నిర్మించామని, శానిటరీ ప్యాడ్‌లు అందించామని, గర్భణీలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మోదీ చెప్పారు.
సుధామూర్తి తొలి ప్రసంగం ఇదే..
గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ఆడపిల్లలకు టీకాలు వేయాలని సుధామూర్తి సూచించారు. "తొమ్మిది నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆడపిల్లలకు సర్వైకల్ వ్యాక్సినేషన్ టీకా ఇవ్వాలి. ఈ టీకా తీసుకుంటే ఆడపిల్లలను క్యాన్సర్ నుంచి కాపాడవచ్చు. వీటిని ప్రోత్సహించాలి ”అని సుధామూర్తి తన తొలి ప్రసంగంలో తెలిపారు.
కొవిడ్ సమయంలో ప్రభుత్వం అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిందని... కాబట్టి 9-14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకాలు వేయడం కష్టం కాదని అన్నారు. గర్భాశయ టీకాను పశ్చిమ దేశాల్లో అభివృద్ధి చేసి, 20 ఏళ్లుగా ఉపయోగిస్తున్నట్లు వివరించారు.
"ఈ టీకా చాలా బాగా పని చేస్తోంది. దీని ఖరీదు కూడా తక్కువే. బహిరంగ మార్కెట్లో రూ.1,400గా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్చలు జరిపితే రూ.700 - 800 వరకు అందుబాటులోకి వస్తుంది"అని సుధామూర్తి పేర్కొన్నారు.
For Latest News and National News click here