Prime Minister Modi : మా వల్లే పాక్ భిక్షాపాత్రతో తిరుగుతోంది
ABN , Publish Date - May 19 , 2024 | 05:11 AM
గత డెబ్బయి ఏళ్లుగా చేతిలో బాంబులు పెట్టుకొని బెదిరించిన పాకిస్థాన్ ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకొని తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. హరియాణాలోని అంబాలాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
మనకు కీడు తలపెట్టాలంటే వందసార్లు ఆలోచిస్తారు
హరియాణా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 18: గత డెబ్బయి ఏళ్లుగా చేతిలో బాంబులు పెట్టుకొని బెదిరించిన పాకిస్థాన్ ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకొని తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
హరియాణాలోని అంబాలాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువులు కూడా ఏదన్నా చేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారని చెప్పారు. తమది బలమైన ప్రభుత్వం కాబట్టే ఆర్టికల్ 370 గోడలు బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే జమ్మూ కశ్మీరు పరిస్థితిని మార్చగలిగేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హరియాణాకు చెందిన సైనిక యోధుల తల్లుల కంటి మీద కునుకు ఉండేది కాదన్నారు. గత పదేళ్లుగా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఆగిపోయాయని చెప్పారు. ఆర్టికల్ 370ని ధైర్యం చేసి రద్దు చేయడం వల్లే కశ్మీరు అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రకటించారు. ఇండీ కూటమి దేశ వ్యతిరేకుల కూటమి అని మోదీ అభివర్ణించారు.
రాముడు కాంగ్రె్‌సను అధికారంలోకి రానివ్వడు
అయోధ్యలోని బాల రాముడు కాంగ్రె్‌సను అధికారంలోకి రానివ్వడని యూపీ సీఎం యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ముంబయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాజా ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయన్నారు.
రాముడికి ఆలయం కట్టడంతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే అయోధ్యలో ఆలయాన్ని కూల్చేస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు.