Share News

Lok Sabha Polls 2024: వీవీప్యాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సభలో మోదీ స్పందన

ABN , Publish Date - Apr 26 , 2024 | 03:54 PM

ఈవీఎం-వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు బలంగా తీర్పు ఇచ్చిందని, పేపర్ బ్యాలెట్ రూపంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను తోసిపుచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభ దినమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ ఎప్పుడూ గౌరవించలేదని విమర్శలు గుప్పించారు.

Lok Sabha Polls 2024: వీవీప్యాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సభలో మోదీ స్పందన

అరారియా: ఈవీఎం-వీవీప్యాట్‌ (EVM-VVPAT)పై సుప్రీంకోర్టు (Supreme Court) బలమైన తీర్పు ఇచ్చిందని, పేపర్ బ్యాలెట్ రూపంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను తోసిపుచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభ దినమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ ఎప్పుడూ గౌరవించలేదని విమర్శలు గుప్పించారు. బీహార్‌ (Bihar)లోని అరారియాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ, బీహార్‌లో గత పాలకుల హయాంలో బూత్ క్యాప్చరింగ్ అనేది సర్వసాధారణ విషయంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోటా కిందకు బీహార్ ముస్లింలను తీసుకురావాలనే యోచనలో ఉందని కూడా ప్రధాని ఆరోపించారు.


''రాజ్యాంగాన్ని కానీ, ప్రజాస్వామాన్ని కానీ కాంగ్రెస్, ఆర్జేడీ ఎప్పుడూ లెక్కచేయలేదు. దశాబ్దాలుగా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకోనీయలేదు. బూత్‌ క్యాప్చరింగ్ అనేది సర్వసాధారణ విషయంగా ఉండేది. ప్రజలను ఓటు వేయడానికి బయటకు కూడా రానిచ్చే వారు కాదు. ఇప్పుడు ఆలా కాదు. పేదలు, నిజాయితీ ఓటర్ల బలం ఈవీఎంలు. ఆ కారణంగానే ఈవీఎంలను వదిలించుకోవాలని కాంగ్రెస్, ఆర్జేడీ ప్రయత్నాలు చేశాయి. అయితే, ఇవాళ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. పాత పద్ధతిలో బ్యాలెట్ పత్రాల ఓటింగ్‌‌ను వెనక్కి తెచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది" అని ప్రధాని అన్నారు.

Delhi: వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించవద్దని హితవు


కర్ణాటక తరహాలోనే..

కర్ణాటక తరహాలోనే ఓబీసీ రిజర్వేషన్ పరిధిలోకి ముస్లింలను తీసుకురావాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ప్రధాని ఆరోపించారు. ఎస్‌సీలు, ఎస్టీలు, ఓబీసీల హక్కులను కొల్లకొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ఎంతో బాధ్యతాయుతంగా చెబుతున్నానని వివరణ ఇచ్చారు. మతఆధారిత రిజర్వేషన్లు ఉండరాదని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మత ఆధారిత రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తోందన్నారు. కర్ణాటకలో ఓబీసీ కమ్యూనిటీని కాంగ్రెస్ వంచించిందని, ఓబీసీ జాబితాలో ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా ముస్లింలను చేర్చిందని అన్నారు. దీంతో ప్రస్తుతం ఓబీసీల వాటాలోని 27 శాతం రిజర్వేషన్ ముస్లింల ఖాతాలోకి వెళ్లిపోయిందన్నారు. బీహార్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పద్ధతి అమలు చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోందని మోదీ ఆరోపించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 03:54 PM