Congress: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే.. ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 08 , 2024 | 07:34 AM
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రాహుల్ గాంధీ నిలిచారని, లోక్ సభ విపక్షనేత పదవిని ఆయన చేపట్టడమే కరెక్ట్ థరూర్ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో రాహుల్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారని, అయితే ఖర్గే ఇప్పటికే రాజ్యసభలో విపక్షనేత కావడంతో లోక్ సభలో ఆ హోదాకు రాహులే సమర్థుడని చెప్పారు. దురహంకారం, తాము చేసిందే సరైనదనే వాదంతో వ్యవహరిస్తున్న బీజేపీకి దేశ ప్రజలు తగిన మెసేజ్ పంపారని స్పష్టం చేశారు.
"ప్రభుత్వాన్ని నడపడంలో ఎవరినీ సంప్రదించే అలవాటులేని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు ప్రభుత్వాన్ని నడపడం ఇప్పుడు సవాలే. అగ్నివీర్ పథకంపై జేడీయూ ప్రశ్నలు లేవనెత్తింది. ఏపీ, బిహార్లు ప్రత్యేక హోదా కోసం డిమాండ్లు చేస్తున్నాయి. ఇలాంటివాటిపై ఇప్పుడు ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి ఉంటుంది. 230 మంది ఎంపీలతో విపక్షం బలంగా ఉన్నందు వల్ల మునుపటి మాదిరిగా పార్లమెంటును రబ్బరు స్టాంపుగా, నోటీసుబోర్డుగా చూస్తామంటే కుదరదు. నిర్ణయాలు ఏకపక్షంగా, ఆకస్మికంగా తీసుకునే వీలుండదు" అని థరూర్ అన్నారు.
పార్టీలోకి యువ రక్తం రావాలి అందుకు తగినట్లే ఎప్పటికప్పుడు పాత వారు తప్పుకోవాలని థరూర్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల బరిలో తాను నిలవబోనని స్పష్టం చేశారు.
For Latest News and National News click here