Madhya Pradesh: సైనికుల రైలు వెళ్లే పట్టాలపై డిటోనేటర్లు!
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:02 AM
రైలు పట్టాలపై డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్‌లు ఉంచిన ఘటనలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి.
యూపీలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్
దర్యాప్తు జరుపుతున్న రైల్వే, ఎన్‌ఐఏ
మధ్యప్రదేశ్‌లో ఘటన..యూపీలో పట్టాలపై సిలిండర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: రైలు పట్టాలపై డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్‌లు ఉంచిన ఘటనలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీరు నుంచి కర్ణాటకకు సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు.. మధ్యప్రదేశ్‌లోని సగ్‌ఫతా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా పట్టాలపై డిటోనేటర్లను గుర్తించారు. వాటిని గమనించిన డ్రైవర్ రైలును కొద్దిసేపు ఆపి, స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన బుధవారం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.
ఆ డిటోనేటర్లు హానికరమైనవి కాదని, అయినా అవి పట్టాలపై ఎందుకు ఉంచారనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఆదివారం గ్యాస్ సిలిండర్‌ను గుర్తించారు. దాన్ని చూసిన గూడ్స్ రైలు డ్రైవర్ అత్యవసర బ్రేకులు వాడి, రైలును నిలిపివేశారు. రైలు కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తోంది. యూపీలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.
ఈ నెల 8న కళింది ఎక్స్‌ప్రెస్ వెళ్లే మార్గంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను ఉంచిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో రైలు ప్రమాదాలకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా? అన్న కోణంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ జరుపుతోంది.