Share News

Delhi Water Crisis: ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 13 , 2024 | 02:53 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మంచి నీటి సరఫరా కోసం.. అప్పర్ యమునా రివర్ బోర్డ్‌ (యూవైఆర్బీ)తో సంప్రదింపులు జరపాలని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Delhi Water Crisis: ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ, జూన్ 13: దేశ రాజధాని న్యూఢిల్లీలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మంచి నీటి సరఫరా కోసం.. అప్పర్ యమునా రివర్ బోర్డ్‌ (యూవైఆర్బీ)తో సంప్రదింపులు జరపాలని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యూఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో మానవతా దృక్పథంతో మంచి నీటిని సరఫరా చేయాలంటూ యూవైఆర్బీకి ఈ రోజు సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇది సున్నితమైన అంశమని అభివర్ణించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రసన్న బి వరాలే ఆదేశించారు. ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీకి మంచి నీటి సరఫరా అంశంపై అప్పర్ యమునా రివర్ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.


న్యూఢిల్లీలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. నీటి కొరత తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే నగరంలో ట్యాంకర్ మాఫియా నియంత్రణతోపాటు మంచి నీటి వృధా కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్ మాఫియా నియంత్రించడంలో పోలీసుల జోక్యం చేసుకోవాలని ఆదేశించమంటారా? అంటూ ఆప్ ప్రభుత్వానికి మొట్టి కాయలు సైతం వేసింది.


మరోవైపు ప్రజలకు సరఫరా చేస్తున్న మంచి నీటి పైపుల్లో నీరు ఉండడం లేదు... కానీ మంచి నీటి ట్యాంకర్ల పైపుల్లో నిత్యం నీరు ఎలా ఉంటుందంటూ ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించిన విషయం విధితమే. ఆ క్రమంలో ఈ అంశంపై గురువారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్సష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 02:54 PM