Summer: ఏప్రిల్ 22 నుంచి పాఠశాలలు బంద్.. ఎందుకంటే
ABN , Publish Date - Apr 20 , 2024 | 08:38 PM
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. జార్ఖండ్ కూడా ఏప్రిల్ 22 నుంచి విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
తదుపరి నోటీసు వచ్చాక పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కిండర్ గార్డెన్(LKG, UKG) నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 7 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం వరకు క్లాసులు కొనసాగుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 20 నుంచి 22 వరకు 15 జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని హెచ్చరించింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని బహరగోరలో శనివారం అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర జిల్లాల్లో 42.4 నుంచి 45.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజధాని రాంచీలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాంచీ వాతావరణ కేంద్రం అనేక జిల్లాలు హీట్ వేవ్‌తో ప్రభావితమయ్యే అవకాశం ఉందని గుర్తించింది.
"రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం చాలా తక్కువ. ఆ తర్వాత జార్ఖండ్‌లోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో రెండు-మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గవచ్చు" అని రాంచీ వాతావరణ కేంద్రం ఇన్‌ఛార్జ్ అభిషేక్ ఆనంద్ తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకి రావద్దని, తరచూ శీతల పానీయాలు తాగాలని, లేత రంగు, వదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించాలని, టోపీ, గొడుగును వాడాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి