Share News

ఇప్పటికైతే శరద్‌ వర్గానికి అదే పేరు

ABN , Publish Date - Feb 20 , 2024 | 06:00 AM

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) వివాదం విషయంలో సోమవారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి శరద్‌ పవార్‌ వర్గం తమ పార్టీ పేరును ఎన్‌సీపీ-శరద్‌చంద్ర పవార్‌గా కొనసాగించుకోవచ్చని తెలిపింది.

ఇప్పటికైతే శరద్‌ వర్గానికి అదే పేరు

ఎన్‌సీపీ-శరద్‌చంద్ర పవార్‌గాకొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) వివాదం విషయంలో సోమవారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి శరద్‌ పవార్‌ వర్గం తమ పార్టీ పేరును ఎన్‌సీపీ-శరద్‌చంద్ర పవార్‌గా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఈ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించే విషయమై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలోనిదే నిజమైన ఎన్‌సీపీ అని ఈ నెల ఆరో తేదీన ఎన్నికల సంఘం ప్రకటించింది. శరద్‌ పవార్‌ వర్గాన్ని ఎన్‌సీపీ-శరద్‌చంద్ర పవార్‌గా పేర్కొంటూ మరుసటి రోజైన ఏడో తేదీన మరో ఉత్తర్వులు ఇచ్చింది. ఇది తాత్కాలిక ఏర్పాటు అని, రాజ్యసభ ఎన్నికలు జరిగే ఈ నెల 27 వరకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శరద్‌ పవార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదంటూ ప్రత్యర్థి అజిత్‌ పవార్‌ కూడా కెవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీనిపై అభ్యంతరాలు చెప్పేందుకు అజిత్‌ పవార్‌ వర్గానికి వారం రోజుల గడువు ఇచ్చింది. దానిపై వివరణ ఇచ్చేందుకు శరద్‌ పవార్‌ వర్గానికి మరో రెండు వారాల సమయం ఇచ్చింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ విశ్వనాథన్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. పాకిస్థాన్‌ ఎన్నికలతో పోల్చడం సరికాకపోయినా అక్కడ బ్యాట్‌ గుర్తు కావాలని ఒకరు అడిగారు, దాన్ని ఇవ్వలేదు, తరువాత చాలా జరిగిందని అన్నారు. ఓటరు మాటకు విలువ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలపై శరద్‌పవార్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 07:04 AM