Sukhbir Badal: మత పెద్దల శిక్ష.. గోల్డెన్ టెంపుల్ వద్ద సేవాదార్ డ్యూటీ చేసిన సుఖ్‌బీర్ బాదల్..!
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:12 PM
2007 నుంచి 2017 మధ్య అకాలీ దళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పులకు శిక్షగా సిక్కు మత పెద్దలు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో మంగళవారం ఆయన తన సహచరలతో కలిసి గోల్డెన్ టెంపుల్ దగ్గర సేవ చేశారు.
శిరోమణి అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Badal) అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ (Golden Temple) దగ్గర సేవాదార్ (sewadar) డ్యూటీ నిర్వహించారు. స్వర్ణ దేవాలయం దగ్గర బట్టలు ఉతికి, పాత్రలు శుభ్రం చేశారు. మతపరమైన శిక్షకు సంబంధించిన ఫలకను మెడలో వేసుకుని ఆయన ఈ పనులన్నీ చేశారు. 2007 నుంచి 2017 మధ్య శిరోమణి అకాలీ దళ్ (Shiromani Akali Dal) ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పులకు శిక్షగా సిక్కు మత పెద్దలు ఆయనకు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో మంగళవారం ఆయన తన సహచరలతో కలిసి గోల్డెన్ టెంపుల్ దగ్గర సేవ చేశారు.
సిక్కు మతాచారం ప్రకారం శ్రీ అకాల్ తక్త్ సాహిబ్ కింద ఆయనకు ఆ శిక్షను ఖరారు చేశారు. సుఖ్‌బీర్ మతపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిక్కు పెద్దలు ఇటీవల తీర్మానించారు. దాదాపు మూడు నెలల తర్వాత ఆ శిక్షను అనుభవించేందుకు బాదల్ ముందుకు వచ్చారు. కాలుకు దెబ్బ తగలడంతో వీల్ చైర్‌లో కూర్చుని బాదల్ తన డ్యూటీని పూర్తి చేశారు. పాత్రలను శుభ్రం చేశారు. చెప్పులను కూడా తుడువనున్నారు. సాద్ నేత సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా కూడా మెడలో ఫలకను, చేతిలో బల్లాన్ని పట్టుకుని.. గేటు వద్ద సెంట్రీ విధులు నిర్వహించారు.
``సేవ చేయాలని దేవుడు నాకు ఆదేశం ఇచ్చారు. ఆయన ఆదేశాన్ని శిరసావహిస్తా. అకాల్ తక్త్‌లో భాగంగా ఇది జరిగింది. గేటు వద్ద కూర్చుంటాను. లంగర్‌లో కూడా సేవ చేస్తాను`` అని సుఖ్‌బీర్ బాదల్ తెలిపారు. అకాలీ నాయకులు అయిన సుచా సింగ్, హిరా సింగ్, బల్వీందర్ సింగ్, దల్జీత్ సింగ్, గుల్జార్ సింగ్‌కు కూడా శిక్ష పడింది. వారందరూ స్వర్ణ దేవాలయంలోని బాత్రూమ్‌లను గంట పాటు శుభ్రం చేయాలని, స్నానం చేసిన తర్వాత టెంపుల్ కిచెన్‌లో పాత్రలను శుభ్రం చేయాలని మత పెద్దలు ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..