Supreme Court : బాల్యవివాహం సామాజిక దురాచారం
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:41 AM
బాల్య వివాహం ఓ సామాజిక దురాచారమని, పర్సనల్ చట్టాలు, వాటిలోని సంప్రదాయాలు బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అడ్డుకోజాలవని సుప్రీంకోర్టు పేర్కొంది.
వ్యక్తిగత చట్టాలు.. బాల్యవివాహ నిరోధక చట్టాన్ని అడ్డుకోజాలవు
సుప్రీం స్పష్టీకరణ.. మార్గదర్శకాల జారీ
చట్టం అమలుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులు, పోలీసు విభాగం
మూడు నెలలకోమారు సర్వే
సుప్రీం స్పష్టీకరణ..మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ, అక్టోబరు 18: బాల్య వివాహం ఓ సామాజిక దురాచారమని, పర్సనల్ చట్టాలు, వాటిలోని సంప్రదాయాలు బాల్య వివాహ నిరోధక చట్టాన్ని అడ్డుకోజాలవని సుప్రీంకోర్టు పేర్కొంది. మైనర్‌గా ఉన్నప్పుడే వివాహం చేయటం వల్ల తనకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం సదరు వ్యక్తులు కోల్పోతారని గుర్తు చేసింది. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ‘సేవ’ అనే స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి 141 పేజీల తీర్పును వెలువరించింది.
బాల్య వివాహాల నిరోధానికి తొమ్మిది శీర్షికల కింద పలు మార్గదర్శకాలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, సంబంధిత ప్రభుత్వ సంస్థలకు ఈ తీర్పులో సుప్రీంకోర్టు జారీ చేసింది. బాల్య వివాహ నిరోధక చట్టం అమలుకు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమించాలని, వారికి ఇతర బాధ్యతలేవీ అప్పగించకూడదని ఈ మార్గదర్శకాల్లో సుప్రీంకోర్టు తెలిపింది. చట్టం అమలు తీరుపై మూడునెలలకోమారు సర్వే నిర్హహించాలని నిర్దేశించింది.
జిల్లా స్థాయిలో బాల్యవివాహాలను నిరోధించే బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తీసుకోవాలని పేర్కొంది. అంతేగాక, ఒక ప్రత్యేక పోలీసు విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బాల్యవివాహ ఘటనలపై న్యాయమూర్తులు కూడా సుమోటోగా తీసుకొని ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది. బాల్యవివాహాలను అడ్డుకోవటంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ‘బాల్యదశ అంటేనే చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోలేదని అర్థం. వివాహం అనేది ఒక చట్టబద్ధమైన వ్యవస్థ. వివాహం పరిధిలోకి ప్రవేశించే వ్యక్తుల బాధ్యతలను బాలబాలికలు అర్థం చేసుకోలేరు’ అని ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
పలు కారణాలు
బాల్యవివాహాలను లింగం, కులం, సామాజిక ఆర్థిక పరిస్థితి, ప్రాంతం వంటివి ప్రభావితం చేస్తున్నాయని.. పేదరికం, అసమానతలు, నిరక్షరాస్యత వంటివి మూల కారణాలుగా నిలుస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో, బాల్యవివాహాల నిరోధానికి ఒకే రకమైన విధానాలను పాటించకుండా, వేర్వేరు సమూహాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించింది. సమాజంలోని భిన్న భాగస్వామ్యపక్షాలను సమన్వయం చేసుకుంటూ సమష్టిగా చర్యలు తీసుకుంటేనే బాల్యవివాహ నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటం వీలవుతుందని పేర్కొంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచటం, బాల్య వివాహాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవటానికి వీలుగా పోలీసు తదితర దర్యాప్తు సంస్థలకు వెంటనే సమాచారం అందించే వ్యవస్థలను ఏర్పాటు చేయటం, పోలీసులకు శిక్షణనివ్వటం తదితర చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
బాల్యవివాహాలు జరిపించిన వ్యక్తులు, కుటుంబాలపై నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం అవసరమేగానీ.. వాటికన్నా బాల్యవివాహాలను నిరోధించటం, బాలలను సంరక్షించటానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దర్యాప్తు సంస్థలకు సూచించింది. సదరు చట్టం, అది విధించే శిక్షలపైన కూడా ప్రజల్లో ప్రచారం చేయాలని తెలిపింది. కాగా.. బాల్య వివాహాలకు సంబంధించి కేంద్రం తన వైఖరిని వెల్లడిస్తూ.. పర్సనల్ చట్టాల కన్నా బాల్య వివాహ నిరోధక చట్టమే పైచేయిగా ఉండాలని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశానికి సంబంధించిన బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.
కీలక విజయం
సుప్రీం తీర్పుపై ‘సేవ’తోపాటు పలు స్వచ్ఛందసంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. బాల్యవివాహం అనే సామాజిక దురాచారంపై జరుగుతున్న యుద్ధంలో ఇది కీలక విజయమని పేర్కొన్నాయి. 2030 నాటికి దేశంలో బాల్యావివాహాలను పూర్తిగా అడ్డుకునే లక్ష్యంతో 200కిపైగా స్వచ్ఛందసంస్థలు ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.