Supreme Court: ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం: సుప్రీంకోర్టు
ABN , Publish Date - May 24 , 2024 | 03:26 PM
లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉన్నందున ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారిగా వెబ్‌సైట్‌లో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్పష్టం చేసింది. ఇందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉన్నందున ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారిగా వెబ్‌సైట్‌లో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని (EC) తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారంనాడు స్పష్టం చేసింది. ఇందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ పూర్తయి మరో రెండు విడతలతో పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నందున అలాంటి ఆదేశాలు తాము ఇవ్వలేమని న్యాయమూర్తులు దీపంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజస్వామ్య సంస్కరణల సంఘం (ADR) దాఖలు చేసిన ఈ అంశంపై ఎన్నికలు పూర్తయిన తర్వాత రెగ్యులర్ బెంచ్ విచారణ చేస్తుందని తెలిపింది
పోలింగ్ జరిగిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే అంశంపై బూత్ ఓటర్ల డాటాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచేలా ఆదేశించాలని తమ పిటిషన్‌లో సుప్రీంకోర్టును ఏడీఆర్ కోరింది. తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ, అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, బూత్ డాటాను అప్‌లోడ్ చేయడం వల్ల ఓటర్లు అయోమయానికి లోనయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే అంశంపై మరో పిటిషన్ కూడా 2019 నుంచి పెండింగ్‌లో ఉన్నట్టు కోర్టు ధర్మాసనం తెలిపింది.
Lok Sabha Elections: ఢిల్లీలో లక్షకు పైగా పోలింగ్ సిబ్బంది.. ఓటర్లకు స్విగ్గీ, జొమాటో కూపన్లు
దీనికి ముందు, ఏడీఆర్ పిటిషన్‌పై వారం రోజుల్లోగా స్పందన తెలియజేయాలని మే 17న ఈసీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే పిటిషన్‌దారు డిమాండ్‌ను ఈసీ వ్యతిరేకించింది. ఇలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గంగదరోళానికి గురవుతుందని వివరణ ఇచ్చింది.ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలియజేసే ఫామ్ 17(సి)ని బయటపెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తు చేసింది.
Read Latest News and National News here