Jamili Elections: జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
ABN , Publish Date - Sep 18 , 2024 | 04:23 PM
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ విమర్శించింది. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది.
ఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ విమర్శించింది. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది. జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావని పేర్కొంది. కేంద్ర ప్రతిపాదనను అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడరని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ మేరకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. " జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావు. కేంద్రం ప్రతిపాదనను ఎవరు అంగీకరించరు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు నిర్వహించాల్సిందే. జమిలి ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు. జమిలి ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది" అని ఖర్గే స్పష్టం చేశారు. అయితే.. ఆ పార్టీ విమర్శలపై బీజేపీ మండిపడుతోంది.
త్వరలో పార్లమెంటులో బిల్లు..
కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది.
8 మంది సభ్యులతో కమిటీ..
కేంద్ర సర్కార్ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్ కోవింద్ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.