Share News

Amul: తిరుమల లడ్డూ వివాదం.. సీన్‌లోకి అమూల్ ఎంట్రీ

ABN , Publish Date - Sep 21 , 2024 | 07:48 PM

తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఈ సీన్‌లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది.

Amul: తిరుమల లడ్డూ వివాదం.. సీన్‌లోకి అమూల్ ఎంట్రీ
Tirupati Prasadam Row

ఇంటర్నెట్ డెస్క్: తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఈ సీన్‌లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది. తిరుపతి ఆలయానికి అమూల్.. జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యిని సరఫరా చేసిందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో నెటిజన్లు ఆరోపణలు గుప్పించారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న అమూల్ కంపెనీ యాజమాన్యం శనివారం పలువురిపై కేసు నమోదు చేసింది.


‘‘తిరుపతిలో ఉపయోగించే నెయ్యి కల్తీ అని తేలింది. కొందరు వ్యక్తులు ఆ నెయ్యిని అమూల్ సరఫరా చేసిందని వదంతులు సృష్టిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాం. మా కంపెనీతో 36 లక్షల కుటుంబాలు అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. వారిని మా నుంచి వేరు చేసేందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మా ఉత్పత్తులు అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉంటాయి. నాణ్యత విషయంలో మేమెక్కడా తగ్గం. మాపై జరుగుతున్న దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాం. ఇప్పటివరకు టీటీడీకి మేం ఏ ఆహార పదార్థం సరఫరా చేయలేదు”అని అమూల్ మాతృ సంస్థ, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా అన్నారు. వ్యతిరేకప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం వెళ్తామని ఆయన వెల్లడించారు.


అమూల్ చరిత్ర ఇదే..

ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్...క్లుప్తంగా...అమూల్ ఇండియా (Amul India) 1948లో ఏర్పాటైన భారతీయ సహకార డెయిరీ సంస్థ. సంస్కృత పదం 'అమూల్యం' నుంచి 'అమూల్' పదం పుట్టింది. సంస్కృతంలో అమూల్యం అంటే.. విలువైనది, వెలకట్టలేనిది అనే అర్థం ఉంది. గుజరాత్‌ (Gujarat)లోని ఆనంద్‌లో పుట్టి భారతదేశంలోని ప్రముఖ ఆహార బ్రాండ్‌గా ఎదిగి, అంతర్జాతీయ మార్కెట్ వరకూ విస్తరించిన క్రెడిట్ అమూల్‌దే. అమూల్ ప్రస్తుతం రోజూ దాదాపు 1.3 కోట్ల లీటర్ల పాలను ప్యాకింగ్ చేస్తోంది. వీటిని 36 లక్షల మంది పాడి రైతులు, 18 సంఘాల నుంచి సేకరిస్తుంది. 1946లో త్రిభువన్‌దాస్ కిషీభాయ్ పటేల్ 'అమూల్' సంస్థను స్థాపించగా, వర్గీస్ కురియన్ జనరల్ మేనేజర్‌గా, సాంకేతిక, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు.


ఆ తర్వాత అమూల్ చైర్మన్‌గా మార్కెట్‌లో విజయం సాధించారు. దేశంలో శ్లేత విప్లవాన్ని అమూల్ ప్రోత్సహించింది. క్రమంగా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. ఆనంద్‌లోని తొలి ఆధునిక పాడి పరిశ్రమ క్రమంగా సహకార సంస్థ మార్కెట్‌లో గట్టి పోటీదారుగా నిలిచింది. గుజరాత్‌లోని పాల సహకార సంఘాలు కోట్లాది మంది వినియోగదారులతో 3.1 మిలియన్లకు పైగా గ్రామ పాల ఉత్పత్తులను అనుసంధానించే ఆర్థిక నెట్‌వర్క్‌ను విస్తరించింది.

Prasadam Row: ప్రసాదంలోనూ.. గీ..కుడేనా!?
Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి? తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి?

Updated Date - Sep 21 , 2024 | 08:21 PM