Share News

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:17 AM

మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్‌ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

  • తన పౌరులను కాపాడుకోవడంలో విఫలం

  • యూఎన్‌ నివేదిక.. ఇజ్రాయెల్‌ తిరస్కరణ

  • మహిళలపై హమాస్‌ లైంగిక హింస

  • శవాల్ని విజయ చిహ్నాలుగా ప్రదర్శించారు

  • మరోనివేదికలో వెల్లడించిన ఐరాస

  • ఇరు వర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం

జెనీవా, జూన్‌ 13: మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్‌ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది అక్టోబరు ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు, పాలస్తీనాలోని సాయుధ మూకల దాడితో మొదలైన యుద్ధంపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర దర్యాప్తు సంఘం లోతుగా విచారణ జరిపి.. రెండు వేర్వేరు నివేదిక అందజేసింది.

పాలస్తీనా దళాలు, హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ సైనికులు, పౌరులపై దాడులు చేసి హత్యలు చేయడం, గాయపరచడం, అవమాన పరచడం, బందీలుగా తీసుకెళ్లడం, మహిళలను లైంగికంగా వేధించడం వంటి అరాచకాలకు పాల్పడినట్టు ఒక నివేదికలో పేర్కొంది. ఇవన్నీ యుద్ధనేరాలేనని, అంతర్జాతీయ మానవత్వ చట్టం (ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ లా-ఐహెచ్‌ఎల్‌), అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం (ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ లా) నిబంధనలను హమాస్‌ అతిక్రమించిందని స్పష్టం చేసింది. హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించి నరమేధం సృష్టించినప్పుడు మృతదేహాలను రూపురేఖలు లేకుండా నాశనం చేశారని.. ముఖ్యంగా, మహిళల భౌతిక కాయాల విషయంలో మరీ దారుణంగా వ్యవహరించారని తెలిపింది. చనిపోయిన మహిళల దుస్తులను, వారి శరీర భాగాలను తొలగించడం, తగులబెట్టడం వంటి అకృత్యాలకు ఆధారాలు లభించినట్టు వివరించింది.

మహిళలను అపహరించిన సమయంలో అమానుషంగా వ్యవహరించారని, వారి మృతదేహాలను విజయ చిహ్నాలుగా, ట్రోఫీలుగా ప్రదర్శించారని పేర్కొంది. చాలా మంది పిల్లల ముందే వారి బంధువులను హత్య చేశారని, ప్రచారం కోసం వీటన్నింటినీ వీడియోలుగా తీశారని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. పిల్లలను కిడ్నాప్‌ చేయడంపై దృష్టి పెట్టారని తెలిపింది. ఇజ్రాయెల్‌ కూడా ఐహెచ్‌ఎల్‌, ఐహెచ్‌ఆర్‌ఎల్‌లను ఉల్లంఘించిందని మరో నివేదికలో పేర్కొంది.


గాజాలో సామాన్య పౌరులపై ఓ పద్ధతి ప్రకారం, విస్తృత స్థాయిలో దాడులు చేసిందని.. అక్కడి వారిని పూర్తిగా నిర్మూలించడం, హత్యలు చేయడం, పాలస్తీనా పురుషులు, బాలురను క్రూరంగా హింసించడం వంటి దారుణాలకు పాల్పడిందని వివరించింది. గాజా ప్రజలకు తిండి, నీళ్లు పరిమితంగా అందేలా చేసి వారి ఆకలిదప్పులతో మాడ్చిందని.. వేలాది మంది చిన్నారులను తీవ్రంగా గాయపరిచిందని పేర్కొంది. అలాగే.. తన పౌరులను కాపాడుకోవడంలో ఇజ్రాయెల్‌ అన్ని విధాలుగా విఫలమయిందని విమర్శించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయెల్‌లో ప్రజలను ఏ రూపంలోనూ ఆదుకోలేదని పేర్కొంది.

బాధితులతో మాట్లాడేందుకు ఇజ్రాయెల్‌ అనుమతి ఇవ్వకపోవడంతో టర్కీ, ఈజిప్ట్‌, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించి సమాచారం సేకరించింది. ఫోరెన్సిక్‌ నివేదికలు, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కొన్ని ఆరోపణలను నిర్ధారించుకొంది. ఐక్యరాజ్యసమితి కమిషన్‌కు ఇజ్రాయెల్‌ అన్ని విధాలుగా ఆటంకాలు కలిగించిందని తెలిపింది. ఈ నివేదికను వచ్చే వారంలో జరగనున్న ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. ఒక పద్ధతి ప్రకారం తమ పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించింది.

Updated Date - Jun 14 , 2024 | 07:44 AM