Share News

Valmiki Scam: సీఎం బాధ్యతారాహిత్యంపై మండిపడిన నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Jul 28 , 2024 | 07:53 PM

'వాల్మీకి కుంభకోణం'లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడిక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన వాల్మీకి కమ్యూనిటీ సొమ్ములను దారి మళ్లించడమేనా మీరు చెప్పే న్యాయం? అని నిలదీశారు.

Valmiki Scam: సీఎం బాధ్యతారాహిత్యంపై మండిపడిన నిర్మలా సీతారామన్

బెంగళూరు: 'వాల్మీకి కుంభకోణం' (Valmiki Scam)లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆదివారంనాడిక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యతారాహిత్యంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. వాల్మీకి స్కామ్‌లో బ్యాంకుల ప్రమేయం ఉన్నందున కేంద్ర ఆర్థిక మంత్రి బాధ్యత వహించాలంటూ సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సూటిగా నిర్మలా సీతారామన్ స్పందించారు. గిరిజన వాల్మీకి కమ్యూనిటీ సొమ్ములను దారి మళ్లించడమేనా మీరు చెప్పే న్యాయం? అని నిలదీశారు. ఎన్నికల సమయంలో 'న్యాయ్' (Justice) అంటూ వాళ్లు (కాంగ్రెస్) మాట్లాడతారని, ఎస్‌సీ, ఎస్‌సిటీలకు వాళ్లు చేసిన న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు.


కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ కార్పొరేషన్‌లో రూ.187 కోట్ల కుంభకోణం జరిగినట్టు సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇందులో రూ.88 కోట్ల అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సిద్ధరామయ్య వాస్తవాలను దాచిపెట్టి కేవలం ఒక జాతీయ బ్యాంకుకు చెందిన అధికారుల ప్రమేయం ఉందనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Puja Khedkar: పూజా కేడ్కర్‌పై డీఓపీటీకి నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిటీ


కేంద్రంపై నిందవేసే ప్రయత్నం...

బ్యాంకుల ప్రమేయం ఉన్నందున కేంద్ర ప్రభుత్వమే వాల్మీకి స్కామ్‌కు బాధ్యత వహించాలని సిద్ధరామయ్య ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఏమాత్రం బాధ్యత లేకుండా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ''మీ మంత్రి రాజీనామా చేశారు. ప్రైవేటు అకౌంట్లలోకి సొమ్ములు మళ్లించారని మీ వాళ్లే చెబుతున్నారు'' అని ఆమె పేర్కొన్నారు. వాల్మీకి కుంభకోణానికి సంబంధించి బ్యాంకు అధికారులపై చర్యలు ఇప్పటికే తీసుకున్నామని, వారిపై తదుపరి చర్యలు కూడా ఉంటాయని చెప్పారు. ఎవరినీ తాము కాపాడే ప్రసక్తే ఉండదన్నారు. వాల్మీకి స్కామ్ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఎవరి పర్వవేక్షణలో ఇది జరిగింది? ఆరోపణలను తప్పించుకునేందుకా? అసలు కుంభకోణం జరగనే లేదని చెప్పేందుకా? అని నిలదీశారు. సిద్ధరామయ్య ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ డబ్బులు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ అయిన విషయం ఆయనకు తెలియకపోవడం విడ్డూరమన్నారు. అధికారులపై బ్యాకు ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. ఇందులో మంత్రి ప్రమేయం ఏమిటి? ఆర్థిక మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి అక్రమంగా నిధుల బదలాయింపు జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోయారు? అని ప్రశ్నించారు.


అసలు స్కామ్ ఏమిటి?

వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ పి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగుచూసింది. నిధుల వ్యవహారం, కార్పొరేషన్ పాత్ర, బ్యాంకు అధికారుల ప్రమేయంపై ఆయన సూసైట్ నోట్‌లో వివరంగా రాశారు. వాల్మీకి కార్పొరేషన్‌కు చెందిన రూ.187.33 కోట్లు వివిధ అకౌంట్లలో ఉంచారు. ఇందులో రూ.40 కోట్లు ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఎంజీ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు మళ్లించారు. మొత్తం రూ.187.33 కోట్లలో రూ.88.63 కోట్లు తెలంగాణలోని కనీసం 217 బ్యాంకు అకౌంట్లకు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కుంభకోణంపై విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రను అరెస్టు చేసింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 07:53 PM