Share News

Buddhadeb Bhattacharya: సీపీఎం దిగ్గజ నేత బుద్ధదేవ్‌ కన్నుమూత

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:05 AM

సీపీఎం దిగ్గజ నేత, పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య (80) ఇకలేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు.

Buddhadeb Bhattacharya: సీపీఎం దిగ్గజ నేత బుద్ధదేవ్‌ కన్నుమూత

కోల్‌కతా, ఆగస్టు 8: సీపీఎం దిగ్గజ నేత, పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య (80) ఇకలేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. 2000 నవంబరు 6 నుంచి 2011 మే13దాకా పశ్చిమబెంగాల్‌ సీఎంగా ఉన్న ఆయన.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. కానీ 2011లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం ఓడిపోవడంతో బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు తెరపడినట్లయింది. ఇప్పుడు ఆయన మరణంతో పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది!! బుద్ధదేవ్‌ కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌ఆర్‌ఎ్‌స ఆస్పత్రి-వైద్యకళాశాలకు అప్పగించనున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.


శుక్రవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని బెంగాల్‌ శాసనసభకు తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించి కార్యకర్తల సందర్శనార్థం అక్కడ కొద్దిసేపు ఉంచనున్నారు. సీఎంగా ఉన్నప్పుడు రెండు గదుల చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్నారంటే బుద్ధదేవ్‌ ఎంత నిరాడంబర జీవి తం గడిపారో తెలుస్తుంది. ఆయన తుదిశ్వాస విడిచింది ఆ ఇంట్లోనే. 1944 మార్చి1న ఉత్తర కోల్‌కతాలోని పండితుల కుటుంబంలో బుద్ధదేవ్‌ జన్మించారు. ఆయన కొన్నాళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1966లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని 1972లో పార్టీ రాష్ట్ర కమిటీకి ఎంపికయ్యారు.


1977లో కాశీపూర్‌- బెల్గాచియా నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. క్యాబినెట్‌ మంత్రిగానూ పనిచేశారు. 1982ఎన్నికల్లో స్వల్పతేడాతో ఓడిపోయిన ఆయన 1987లో జాదవ్‌పూర్‌ నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి 2011దాకా అదే నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. జ్యోతిబసు ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. బుద్ధదేవ్‌ నేతృత్వంలో సీపీఎం 2001, 2006 ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక పారిశ్రామిక వ్యతిరేక పార్టీ అనే ముద్రను చెరిపివేయడానికి ఆయన ఎంతోకృషి చేశారు. సింగూరులో టాటా మోటార్స్‌ నానో కార్ల తయారీ ఫ్యాక్టరీకి అనుమతులిచ్చారు.


కానీ అక్కడ భూసేకరణపై చెలరేగిన వివాదాన్ని, నందిగ్రామ్‌లో నిరసనకారులపై పోలీసు కాల్పులను ఆయుధంగా మలచుకున్న మమతాబెనర్జీ 2011లో గెలిచి అధికారంలోకి వచ్చారు. అనంతరం బుద్ధదేవ్‌ క్రియాశీల రాజకీయాల నుంచి క్రమంగా తప్పుకొన్నారు. కాగా.. బుద్ధదేవ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, సీపీఎం సీనియర్‌ నేత సీతారాం ఏచూరి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Updated Date - Aug 09 , 2024 | 05:05 AM