Share News

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:34 AM

వయనాడ్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్‌సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

  • కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నిక

  • తొలిసారిగా ఎన్నికల బరిలో ప్రియాంక

  • గెలుపునకు సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్‌

  • రేపు ప్రియాంక నామినేషన్‌.. సోనియా, రాహుల్‌, ఖర్గే హాజరు

న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వయనాడ్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్‌సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రియాంక గాంధీ గెలుపు కోసం యావత్‌ కాంగ్రెస్‌ దృష్టి కేంద్రీకరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ వయనాడ్‌తోపాటు రాయ్‌ బరేలీ స్థానం నుంచి పోటీ చేసి, రెండుచోట్లా విజయం సాధించారు. రాయ్‌ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. గాంధీ కుటుంబాన్ని రాయ్‌ బరేలి, అమేథీ తర్వాత అక్కున చేర్చుకున్న నియోజకవర్గం వయనాడ్‌. 2019లో కాంగ్రెస్‌ కంచుకోట అమేథీలో రాహుల్‌ గాంధీ ఓటమి పాలవగా, వయనాడ్‌ మాత్రం అఖండ విజయాన్ని అందించింది. 2024 లోకసభ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు రాహుల్‌ గాంధీని అక్కున చేర్చుకున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించారు.

అందుకే.. గాంధీ కుటుంబానికే చెందిన ప్రియాంకను బరిలో నిలపడం ద్వారా వయనాడ్‌ తమకెంతో ప్రత్యేకమని చెప్పేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. వయనాడ్‌లో యూడీఎఫ్‌ తరఫున కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ ఈ నెల 23న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. నామినేషన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఏఐసీసీ తెలిపింది. కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్ర నేతలతోపాటు ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని స్పష్టం చేసింది.


  • ముగ్గురి మధ్య హోరాహోరీ

గాంధీ కుటుంబాన్ని ఓడించి వయనాడ్‌ స్థానాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇప్పటికే బీజేపీ, సంఘ్‌ శ్రేణులు వయనాడ్‌లో ఆపరేషన్‌ ప్రారంభించాయి. స్థానికంగా మంచి పేరున్న విద్యావంతురాలైన నవ్య హరిదా్‌సను రంగంలోకి దింపింది. ప్రియాంక గాంధీ స్థానికేతరురాలు అనే ప్రచారం చేస్తూ, స్థానిక సెంటిమెంట్‌ను రగిలించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు పలువురు రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు.. వామపక్ష పార్టీలకు కంచుకోట కేరళ. అక్కడ అధికార పార్టీ కూడా వామపక్షాలదే. అందుకే.. ఈ సారి ఎలాగైన వయనాడ్‌ను సొంతం చేసుకోవాలని ఎల్‌డీఎఫ్‌ పట్టుదలగా ఉంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో లెఫ్ట్‌ పార్టీకి రాహుల్‌ గాంధీకి మధ్యనే పోటీ నెలకొంది. రాహుల్‌ గాంధీకి 6,47,445 ఓట్లు రాగా, ఎల్డీఎఫ్‌ నుంచి బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి అనీ రాజాకు 2,83,023 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌ 1,41,045 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అందుకే.. ఈ సారి ఎల్డీఎఫ్‌ సైతం వ్యూహాత్మకంగా తమ అభ్యర్థిని మార్చింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ పోటీలో విజయం ఎవరిదనే అంశంపై నవంబరు 13న జరిగే పోలింగ్‌తో స్పష్టత రానుంది. నవంబరు 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.


  • మోదీపై అన్నాచెల్లెళ్ల యుద్ధం..

దేశంలో దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీని నిలువరించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే మోదీ ప్రాభవం తగ్గిందని భావిస్తున్న కాంగ్రెస్‌.. వచ్చే ఎన్నికలలోపు మరింత బలమైన పార్టీగా ఎదిగేందుకు వ్యూహాలకు పదును పెట్టిందని అంటున్నారు. ఇప్పటికే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ తనదైన పాత్ర పోషిస్తున్నారని భావిస్తున్న కాంగ్రెస్‌.. మరోశక్తిగా ప్రియాంక గాంధీని తయారు చేయాలని ఆశిస్తున్నదని చెబుతున్నారు. అందులో భాగంగానే ఆమెను వయనాడ్‌ నుంచి ఎన్నికల బరిలో నిలుపుతున్నారని అభిప్రాయ పడుతున్నారు. వయనాడ్‌లో ప్రియాంక విజయం సాధిస్తే రాహుల్‌, ప్రియాంక చేరోవైపు దేశంలోని ప్రజల తరఫున నిలిచేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోందని అంటున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నదని, అందులో భాగంగానే ప్రియాంకను బరిలోకి దింపుతున్నదని అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 04:34 AM