Share News

Patanjali: ఆ నిబంధన ఎందుకు తొలగించారు.. పతంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:52 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: పతంజలి వాణిజ్యప్రకటనల కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. కేంద్రంపైన, పతంజలి సంస్థపై పిటిషన్‌ వేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ)పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది

Patanjali: ఆ నిబంధన ఎందుకు తొలగించారు.. పతంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

  • డీఎంఆర్‌ యాక్ట్‌లోని రూల్‌ నంబర్‌ 170 ప్రకారం

  • చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ

  • ఆ లేఖపై వివరణ ఇవ్వాలని ఆయుష్‌ శాఖకు ఆదేశం

  • ఎఫ్‌ఎంసీజీ సంస్థల మిస్‌లీడింగ్‌ యాడ్స్‌పై తీసుకున్న

  • చర్యలేమిటో చెప్పాలని మూడు శాఖలకు ఆదేశం

  • పతంజలి ‘క్షమాపణ’ ప్రకటనల పరిమాణంపై ఆరా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: పతంజలి వాణిజ్యప్రకటనల కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. కేంద్రంపైన, పతంజలి సంస్థపై పిటిషన్‌ వేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ)పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘డ్రగ్స్‌ అండ్‌ మ్యాజికల్‌ రెమెడీస్‌ (అబ్జెక్షనబుల్‌ అడ్వర్టైజ్‌మెంట్స్‌) యాక్ట్‌ (డీఎంఆర్‌ యాక్ట్‌)లోని 170వ నిబంధనను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ కేంద్రాన్ని నిలదీసిన ధర్మాసనం.. ‘ఇతరులను వేలెత్తి చూపే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి’ అంటూ ఐఎంఏకు తలంటింది. డీఎంఆర్‌ యాక్ట్‌లోని 170వ నిబంధన ప్రకారం.. తమ ఔషధానికి అద్భుతసామర్థ్యం ఉందంటూ మందుల కంపెనీలు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం.


అలాగే, ఆ నిబంధన ప్రకారం ఆయుర్వేద, సిద్ధ, యునాని సంస్థలు తమ ఔషధాలకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చేముందు సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ.. కీలకమైన ఆ నిబంధనను తొలగిస్తున్నట్టుగా పేర్కొంటూ ఆయుష్‌ మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడాన్ని జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆ నిబంధన కింద ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక చట్టం అమల్లో ఉన్నప్పుడు దాంట్లో ఒక నిబంధనను అమలు చేయొద్దనడం దాన్ని ఉల్లంఘించడం కాదా అని నిలదీసింది. చూడబోతే.. ప్రభుత్వం దృష్టి అంతా ఆదాయం మీదనే ఉన్నట్టు కనిపిస్తోందని ఽవ్యాఖ్యానించింది.

కాగా.. ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో.. కొన్ని ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌) కంపెనీలు కూడా తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు ఇస్తున్న విషయాన్ని కోర్టు ఈ విచారణ సందర్భంగా గుర్తుచేసింది. ప్రజలను అలా మోసపోనివ్వబోమని స్పష్టం చేసింది. అలాంటి ప్రకటనల ద్వారా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు వినియోగదారుల చట్టాలను దుర్వినియోగం చేయకుండా తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని.. కేంద్రాన్ని ఆదేశించింది. రూల్‌ 170 కింద ఎలాంటి చర్యలూ తీసుకోవద్దన్న లేఖపై వివరణ ఇవ్వాలని ఆయుష్‌ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ కేసులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సహప్రతివాదులుగా ఇంప్లీడ్‌ కావాలని ఆదేశించింది.


క్షమాపణ ప్రకటనలూ ఆ సైజులోనే ఉన్నాయా?

తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో బేషరతు క్షమాపణలు చెబుతూ తమ క్లయింట్లు సోమవారంనాడు 67 వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, అవసరమైతే మరిన్ని ప్రకటనలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రాందేవ్‌ బాబా, బాలకృష్ణ తరఫున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే.. ఆ ప్రకటన ఇవ్వడానికి వారం రోజుల సమయం ఎందుకు పట్టిందని ధర్మాసనం నిలదీసింది. అలాగే.. ఆ ప్రకటనల పరిమాణం గురించి కూడా కోర్టు ప్రశ్నించింది. ‘‘క్షమాపణ ప్రకటనలు కూడా పతంజలి సంస్థ ఎప్పుడూ ఇచ్చే ప్రకటనల పరిమాణంలోనే ఉన్నాయా?’’ అని అడిగింది. ఆ పేపర్లను రెండురోజుల్లోగా ఫైల్‌ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Apr 24 , 2024 | 04:53 AM