Sathyadev Interview : ఆ శుక్రవారం ఇంకా రాలేదు
ABN , Publish Date - Nov 23 , 2024 | 11:48 PM
భావోద్వేగాలను సునాయాసంగా పండించగల టాలీవుడ్ నటులలో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఆయన నటించిన ‘జీబ్రా’ సినిమా
భావోద్వేగాలను సునాయాసంగా పండించగల టాలీవుడ్ నటులలో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఆయన నటించిన ‘జీబ్రా’ సినిమా విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆయన తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
జీబ్రా విజయం ఎలాంటి సంతోషాన్ని ఇస్తోంది..?
గ్లాడియేటర్ సినిమాలో ‘విన్ ది క్రౌడ్.. యు విల్ గెట్ ఫ్రీడమ్’ (ప్రజలను గెలుచుకుంటే నువ్వు స్వేచ్ఛను పొందుతావు) అని ఒక డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం నాకు అలా అనిపిస్తోంది. ప్రేక్షకులందరు ‘జీబ్రా’ సినిమాను చాలా ఆనందంగా చూస్తున్నారు. మంచి రివ్యూలు ఇచ్చారు. ఒకరిద్దరు మాత్రం కావాలని తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కొంత బాధ అనిపించింది. ఎందుకంటే అందరూ బావుందన్నప్పుడు- రివ్యూలు కావాలని రాస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! ‘బ్లఫ్ మాస్టర్’కు కూడా గతంలో ఇలాంటి రివ్యూలే కావాలని రాయించారు. వాటి ప్రభావం నుంచి బయట పడటానికి సమయం పట్టింది. అంతే కాదు... సినిమా విడుదల చేయటానికి మాకు చాలా తక్కువ థియేటర్స్ లభించాయి. కానీ వాటిలో చాలా షోలు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి.
మీ నటనా ప్రస్థానం ఎలా సాగుతోంది?
వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బావుందనిపిస్తోంది. కానీ ఎందుకో నాకు రావాల్సినన్ని విజయాలు రాలేదనిపిస్తుంది. ‘బ్లఫ్ మాస్టర్’ బావుందని ఇప్పుడు అనేక మంది చెబుతూ ఉంటారు. కానీ అది పెద్ద విజయం సాధించలేదు. ‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’’ సినిమాను ఇప్పటికీ మెచ్చుకుంటారు. కానీ కొవిడ్‌వల్ల ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ‘తిమ్మరసు’ కూడా చాలా మంచి సినిమా. అది విడుదలయ్యే సమయంలో కొవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. సినిమా హాళ్లలో 50 శాతం మందినే అనుమతించేవారు. దాంతో అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత ‘కృష్ణమ్మ’ రెండేళ్లు ఆగిపోయింది. విడుదలయిన వెంటనే- అంటే- ఆరు రోజులకే ప్రైమ్ ఓటీటీలో వదిలేశారు. దీంతో కలెక్షన్లు సరిగ్గా రాలేదు. ఇప్పుడు ‘జీబ్రా’తో విజయం సాధించాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి. నా సినిమాలు విజయాలు సాధించటానికి ఎంత చేయగలనో అంత చేస్తున్నాను. విజయాలు వచ్చేదాకా పట్టుదల వీడను. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను.
ఇలా విజయాలు తృటిలో తప్పిపోతుంటే బాధగా అనిపించదా?
మొదట్లో చాలా బాధగా అనిపించేది. ‘‘కచ్చితంగా అవుతుంది’’ అనుకున్నప్పుడల్లా ఎదురుదెబ్బ తగిలేది. దాని నుంచి బయట పడి మళ్లీ ట్రాక్ ఎక్కామనుకున్నప్పుడు మరో దెబ్బ.. ఇప్పటిదాకా ఇలా గడిచింది. దీనితో బహుశా నా ప్రయాణం ఇంకా మొదలవలేదు అనే సిద్ధాంతాన్ని నమ్మటం మొదలు పెట్టాను. కొందరికి అతి త్వరగా విజయం లభిస్తుంది. 25 ఏళ్లకే సీఈఓలు అయిపోతారు. 50 ఏళ్లు వచ్చేసరికి పతనం అంచుకు చేరుకుంటారు. కొందరు 50 ఏళ్లకు విజయం సాధించవచ్చు. కానీ ఆ విజయం వారి జీవితం చివరి దాకా ఉంటుంది. నాకు కూడా అంతేనేమో అనుకుంటాను. చాలా మంది ఒక శుక్రవారంతో నటుల జీవితం మారిపోతుందని అనుకుంటూ ఉంటారు. బహుశా ఆ శుక్రవారం నా జీవితంలో ఇంకా రాలేదు.
అపజయాలకు కారణాలేమిటో కనుగొన్నారా?
నేను 150 శాతం శ్రమిస్తాను. కానీ ప్రతిసారి విజయాలు తృటిలో ఎందుకు తప్పిపోతున్నాయో తెలియదు. ఉదాహరణకు బ్యాడ్మింటన్‌ను తీసుకుందాం. దీనిలో జయాపజయాలు మన ప్రతిభపైనే ఆధారపడి ఉంటాయి. కానీ సినిమా అలా కాదు. ఇదొక పెద్ద టీం స్పోర్ట్. మనం చాలా కష్టపడిన తర్వాత ఇతరులు వదిలేస్తే సినిమా ఆడదు. డైరక్షన్‌లో చిన్న లోపం నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా ఎక్కడ తేడా వచ్చినా సినిమా ఆడదు. అన్ని పరిస్థితులూ సక్రమంగా ఉంటేనే సినిమా ఆడుతుంది.
ఈ ఒడుదొడుకుల్లో మీకు ఎమోషనల్ సపోర్టు ఎవరు?
నా భార్య, నా కుమారుడు విక్కి నాకు ఎమోషనల్ సపోర్టు. విక్కితో ఒక్క అరగంట ఆడుకుంటే చాలు... ఒత్తిడి అంతా మాయమైపోతుంది. జీవితం చాలా సులభమైనదనిపిస్తుంది. దీని కోసం ఇంతగా కిందాపైనా పడిపోవాలా అనిపిస్తుంది. వీళ్లిద్దరితో పాటు చిరంజీవి గారు కూడా చాలా పెద్ద సపోర్టు. ఆయన నా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావటంతో ‘జీబ్రా’ అనే సినిమా ఉందనే విషయం చాలా మందికి తెలిసింది.
మీరు ఏ తరహా సినిమాలను ఇష్టపడతారు?
నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. అయితే నాకు నచ్చేదాని కన్నా జనాలకు నచ్చేది చేయాలనేది నా ఉద్దేశం.
ఎలాంటి స్ర్కిప్ట్‌లు ఎంచుకొంటున్నారు?
అందరూ రెండు రకాలైన సినిమాలు ఆడుతున్నాయని చెబుతున్నారు. వాటిలో మొదటిది... కొత్త ప్రపంచాన్ని చూపించేవి. ‘అవతార్, కేజీఎఫ్, బాహుబలి, సలార్’... ఇలాంటివన్నీ ఈ కోవకు వస్తాయి. రెండోది కామెడీ సినిమాలు. ‘జీబ్రా’లో ఒక కొత్త ప్రపంచం ప్రేక్షకులకు కనిపిస్తుంది. అందుకే ఆ పాత్రను ఎంపిక చేసుకున్నా. ఇక రాబోయే సినిమా ‘ఫుల్ బాటిల్’. ఇందులో నేను తాగుబోతు ఆటోడ్రైవర్ వేషం వేస్తున్నా. ఇది క్రైమ్ కామెడీ సినిమా. ఇలా జాగ్రత్తగా ఆలోచించి స్ర్కిప్ట్‌లు ఎంచుకుంటున్నా.
ఎలాంటి సన్నివేశాల్లో నటించాలని అనుకొంటారు?
నేను భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో బాగా నటిస్తాను. ‘నేను ఏడిస్తే పక్కవాళ్లు ఏడ్వాలి..’ అనేది నా భావన. అయితే ఎందుకో తెలియదు.. నేను ఏడ్చినట్లు నటించగలను కానీ సీను కోసం ఏడ్వలేను.
ఇప్పటిదాకా నేను పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లలో సినిమాలు చేయలేక పోయాను. నాకు అలాంటి ఛాన్స్ దొరకలేదు. ‘జీబ్రా’ తర్వాత నాకు అలాంటి అవకాశాలు వస్తాయనుకుంటున్నా.
సివిఎల్‌ఎన్ ప్రసాద్