Director Venky Atluri : మనకు మనమే కంచె వేసుకోవాలి
ABN , Publish Date - Nov 09 , 2024 | 11:10 PM
‘సార్, లక్కీ భాస్కర్’ సినిమాలతో రెండు వరస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమా నిర్మాణంతో పాటు తన చిన్నతనం గురించి కూడా ఎన్నో విశేషాలను ఆయన ‘నవ్య’తో పంచుకున్నారు.
‘సార్, లక్కీ భాస్కర్’ సినిమాలతో రెండు వరస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమా నిర్మాణంతో పాటు తన చిన్నతనం గురించి కూడా ఎన్నో విశేషాలను ఆయన ‘నవ్య’తో పంచుకున్నారు.
చిన్నతనం... నేను పుట్టింది.. పెరిగింది హైదరాబాద్‌లో. నాన్నగారు అట్లూరి సుబ్బారావు సుమారు 45 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వచ్చేశారు. నాకు చిన్నప్పటి నుంచి చదవటం కన్నా.. ఎవరైనా చెబుతుంటే కథలు వినటం ఇష్టం. సినిమాలంటే చాలా ఆసక్తి ఉండేది కానీ ఇంట్లో ఎక్కువగా చూడనిచ్చేవారు కారు. వేసవి సెలవుల్లోనే సినిమాలు చూసేవాడిని. నేను సినీ రంగంలోకి వస్తానని.. దర్శకుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అన్నీ ఒక దాని వెనక ఒకటి యాదృచ్ఛికంగా జరిగిపోయాయి. నా చదువు పూర్తయిన తర్వాత ఉప్పలపాటి నారాయణరావు గారి సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆడలేదు. ఏం చేయాలో తెలియని సందిగ్దత. రెండేళ్ల తర్వాత ‘స్నేహగీతం’లో మాటలు రాయటానికి అవకాశం వచ్చింది. ఆ సినిమా బాగానే ఆడింది. దానితో రచయితగా స్థిరపడాలనుకున్నా. కథలు రాసేవాడిని. ఒక సారి ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కోసం ఒక కథ తయారు చేశా. వెళ్లి చెప్పా. అప్పుడు వాళ్లు ‘‘కథ బావుంది. నువ్వు హీరో కావాలనుకుంటున్నావా? డైరక్షన్ చేస్తావా?’ అని అడిగారు. అప్పటి దాకా నాకు దర్శకత్వం చేయాలనే ఆలోచనే లేదు. ఆ రోజు వాళ్ల మాటలు నా జీవితాన్ని మలుపు తిప్పాయి.
మంచి నటుడిని కాదు...
నేను మంచి నటుడిని కాదు. మంచి రచయితను. దర్శకుడిని. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నటించకూడదని నిర్ణయించుకున్నా. నటన, దర్శకత్వం- ఈ రెండింటిలోను శారీరకంగా నటన చాలా కష్టం. నటులకు శారీరక శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. దర్శకులకు మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. ఇక దర్శకత్వం విషయానికి వస్తే- మనకంటూ ఒక మంచి టీం ఉండాలి. ప్రణాళికాబద్ధంగా షూటింగ్ జరిగేలా చూసుకోవాలి. ఇవి రెండూ లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. షూటింగ్ ఒక పది రోజులు లేటు అయినా పర్వాలేదు. కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలో పది నిమిషాలు లేటు కాకూడదు. ఒక రోజు సెట్‌లో మూడు గంటలు ఆలస్యమైతే మూడు లక్షలు పోతాయి. అందువల్ల షూటింగ్ సమయంలో ప్రతి నిమిషం విలువైనదే!
నిజంగానే కథనాయికలు...
నా సినిమాల్లో కథనాయికలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇప్పటి వరకు నేను రాసిన కథలన్నీ ఆలా కలిసి వచ్చాయి. సాధారణంగా ఒక సినిమా పూర్తయిన పది రోజుల దాకా ఒక శూన్యత ఆవరిస్తుంది. ఆ శూన్యతలోనే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మనను ఉత్తేజపరుస్తాయి. కొన్ని మనతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువ కాలం ప్రయాణం చేసిన ఆలోచన ఎప్పుడూ ఒక మంచి కథను పునాది వేస్తుంది. నేను నా కథలన్నింటినీ అలాగే ఎంపిక చేసుకుంటా! ఉదాహరణకు ‘లక్కీ భాస్కర్’ కథనే తీసుకుందాం. ఆర్థిక నేరాలకు సంబంధించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చాలా తక్కువ వచ్చాయి. ఆర్థిక నేరాలకు సంబంధించి.. ముఖ్యంగా 90ల నేపథ్యంలో జరిగిన నేరాలకు సంబంధించి సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు- అందుబాటులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీ్‌సలన్నీ చూశాను. వీటిలో చాలా పదాలు.. వాటి వెనకున్న అర్థాలు సామాన్య ప్రజలకు అర్థం కావు. ఉదాహరణకు సెక్యూరిటీస్ అనే పదం ఉందనుకుందాం. అది చాలా మందికి అర్థం కాదు. అందువల్ల నేను తీసే సినిమాలో భాష అందరికీ అర్థం కావాలనుకున్నా. చాలా సంక్లిష్టమైన కథను సులభంగా అందరికీ అందించాలనుకున్నా. లక్కీ భాస్కర్ కథను నాలుగు సార్లు రాసుకున్నా. కొన్ని సీన్లు అయితే పది సార్లు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కథ రాసేదిలా...
నేను కథ రాసేటప్పుడు ప్రేక్షకులకు ఏం కావాలి అనే విషయం గురించి ఆలోచించను. రెండో సారి చదివితే నాకు అర్ధం అవుతోందా? లేదా? అనే విషయంపైనే దృష్టి పెడతాను. అందరి మాదిరిగానే నాకు కూడా- ‘‘నా స్ర్కిప్ట్ అందరి నచ్చాలి’’ అనుకుంటాను. కానీ అందరికీ నచ్చేలా రాయాలనుకుంటే - మొత్తానికే మోసం వస్తుంది. ఎక్కడో ఒక చోట మనకు మనం కంచె వేసుకోవాలి.
పక్కవాళ్లకు నచ్చుతుందా లేదా అనే భయంతో రాస్తే సృజనాత్మకత దెబ్బతింటుంది. ఇక నా ఉద్దేశంలో హాస్యరస పూరిత సినిమా చేయటం కష్టం. సినిమాల్లో రాసే హాస్యం వరకు పర్వాలేదు. మొత్తం సినిమా అంతా హాస్యం పడించాలంటే కష్టం. నా దృష్టిలో నేను డ్రామా బాగా పండిస్తాను.
నాకు బిగ్ 4... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లంటే చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా చూసేవాడిని. వాళ్లను చిన్నస్థాయి దేవుళ్లలా కొలిచేవాడిని. ఇక కాలేజీకి వచ్చిన తర్వాత అజిత్‌గారంటే ఇష్టం ఏర్పడింది.
భవిష్యత్తు సినిమాల గురించి ఇంకా ఏం అనుకోలేదు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌కు మరో సినిమా చేయాల్సి ఉంది. దానికి కూడా కథ రాయాలి.
సివిఎల్‌ఎన్ ప్రసాద్